కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కుమార్తె హిమయాని పురీపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై దిల్లీ హైకోర్టు కఠినంగా స్పందించింది. సెక్స్ కుంభకోణం నడిపిన ఎప్‌స్టీన్‌తో ఆమెకు సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తున్న కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు మంగళవారం ఆదేశించింది. న్యాయమూర్తి మినీ పుష్కర్ణ ఆ కేసును విచారిస్తూ పురీకి అనుకూలంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
ఆ తప్పుడు ప్రచారం కొనసాగితే ఆమె ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. అందుకే తాత్కాలిక ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, సోషల్ మీడియాలో హిమయాని పురీని ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తూ ఉన్న పోస్టులు, వీడియోలు, కథనాలను వెంటనే తొలగించాలి. యూజర్లు స్వయంగా వాటిని తొలగించకపోతే సంబంధిత ప్లాట్‌ఫామ్‌లు ఆ కంటెంట్‌ను బ్లాక్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఇలాంటి ఆరోపణలను ఇకపై ప్రచారం చేయకుండా సోషల్ మీడియా వినియోగదారులను నిరోధించింది. ఈ కేసు హిమయాని పురీ దాఖలు చేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో వచ్చింది. తనపై సోషల్ మీడియాలో సమన్వయంతో కూడిన దుష్ప్రచారం జరుగుతోందని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు, దురుద్దేశపూర్వకమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
తన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా సంబంధిత వ్యక్తులు, సంస్థలు తమపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని నిర్భందిత క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. హిమయాని పురీ తన పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు.
ఫిబ్రవరి 22 నుంచి సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్‌తో పాటు పలు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లలో తనపై తప్పుడు కథనాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయని తెలిపారు. ఇవి పూర్తిగా అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. తాను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్ అని హిమయాని పురీ పేర్కొన్నారు. కేవలం మంత్రి కుమార్తె కావడమే తనపై దాడులకు కారణమైందని ఆమె వాదించారు.
ఇదిలా ఉండగా, గతంలో మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఎప్‌స్టీన్‌ను కలిసినట్టు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. అంతర్జాతీయ శాంతి సంస్థలో పనిచేసిన సందర్భంలో మాత్రమే అతడిని కొన్నిసార్లు కలిశానని తెలిపారు. ఒకసారి మాత్రమే ఇమెయిల్ మార్పిడి జరిగిందని, ఎప్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో స్పష్టం చేశారు.
ఈ కేసులో హిమయాని తరఫున సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని వాదనలు వినిపిస్తూ హిమయాని పురీకి గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యం, నిరాధారమని, దురుద్దేశంతో చేసినవని వాదించారు. కోర్టు తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.

More Stories
లోక్‌సభలో 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
రా, ఆర్ఎస్ఎస్లపై ఆంక్షలు… అమెరికా నివేదికపై భారత్ కన్నెర్ర
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే జోరు