ఇరాన్‌పై దాడిని ఖండించిన పోప్ లియో

ఇరాన్‌పై దాడిని ఖండించిన పోప్ లియో

* లెబ‌నాన్‌లో ఐడీఎఫ్ గ్రౌండ్ ఆప‌రేష‌న్‌               * దుబాయ్ లో ఇంధన టాంకర్ పై దాడి 

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయ‌ల్ ద‌ళాలు నిర్వ‌హిస్తున్న దాడిని పోప్ లియో ఖండిస్ట్ త‌క్ష‌ణ‌మే యుద్ధాన్ని విర‌మించాల‌ని కోరారు. హింస ద్వార స్థిర‌త్వాన్ని ఎన్న‌టికీ సాధించ‌లేర‌ని స్పష్టం చేశారు. వాటిక‌న్‌లోని సెయింట్ పీట‌ర్స్ స్క్వేర్‌లో జ‌రిగిన ప్రార్థ‌న‌ల్లో ఆయ‌న ప్ర‌సంగీస్తూ ప‌శ్చిమాసియా ప్ర‌జ‌లు రెండు వారాలుగా భ‌యాన‌క‌మైన హింసను అనుభ‌వించిన‌ట్లు చెప్పారు.

“మధ్యప్రాచ్య క్రైస్తవుల తరపున, అలాగే సద్భావన కలిగిన స్త్రీ పురుషులందరి తరపున, ఈ సంఘర్షణకు బాధ్యులైన వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను,” అని లియో పేర్కొన్నారు. “చర్చలకు మార్గాలు తిరిగి తెరుచుకునేలా కాల్పులను విరమించండి. ప్రజలు ఆశిస్తున్న న్యాయం, స్థిరత్వం, శాంతిని హింస ఎన్నటికీ సాధించిపెట్టలేదు” అని హితవు చెప్పారు. దాడుల వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల త‌ర‌పున ప్రార్థ‌న చేస్తున్న‌ట్లు తెలిపారు.

స్కూళ్లు, ఆస్ప‌త్రులు, రెసిడెన్షియ‌ల్ ప్రాంతాల‌పై జ‌రిగిన దాడుల వ‌ల్ల అనేక మంది మ‌ర‌ణించిన‌ట్లు చెప్పారు. హింస‌తో న్యాయం జ‌ర‌గ‌దు అని, స్థిర‌త్వం, శాంతి స్థాపించ‌లేర‌ని హెచ్చరించారు. యుద్ధంతో వివాదాల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌క్రియ స‌రైంది కాద‌ని వారించారు.

మరోవంక, లెబ‌నాన్‌లోని హిజ్‌బొల్లా మిలిటెంట్ల‌ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ ద‌ళాలు గ్రౌండ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టాయి. ద‌క్షిణ లెబ‌నాన్‌లో ఇజ్రాయెల్ ట్యాంక‌ర్లు రంగంలోకి దిగాయి. ఉత్త‌ర ఇజ్రాయెల్‌లోని నివాసితుల ర‌క్ష‌ణ కోసం గ్రౌండ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్లు ఐడీఎఫ్ పేర్కొన్న‌ది. లెబ‌నాన్‌లో ఉన్న ఉగ్ర‌వాదుల ఏరివేత ల‌క్ష్యంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్లు ఐడీఎఫ్ వెల్ల‌డించింది. 

సైనిక బ‌ల‌గాలు లెబ‌నాన్‌లో అడుగుపెట్ట‌డానికి ముందు కీల‌క ప్రాంతాల‌పై వైమానిక దాడ‌లు చేసిన‌ట్లు ఐడీఎఫ్ చెప్పింది. చాలా వ‌ర‌కు ఉగ్రవాద లక్ష్యాలను  పేల్చివేసిన‌ట్లు పేర్కొన్న‌ది. ఇరాన్ సుప్రీం నేత అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ హ‌త్య‌కు ప్ర‌తీకారంగా ఇజ్రాయెల్‌పై హిజ్‌బొల్లా దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇజ్రాయెల్ జ‌రిపిన దాడుల వ‌ల్ల లెబ‌నాన్‌లో సుమారు 800 మంది పౌరులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. దీంట్లో వంద‌కుపైగా చిన్నారులు ఉన్నారు.

ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరొందిన దుబాయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉన్న ఓ ఇంధన ట్యాంకర్‌పై సోమవారం ఉదయం డ్రోన్‌ దాడి జరగటంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎయిర్‌పోర్టు అధికారులు కొన్ని గంటలపాటు విమాన సర్వీసులను నిలిపివేసిన అనంతరం పునరుద్ధరించారు.  మరోవైపు, యూఏఈపై ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడిలో ఓ వాహనం ధ్వంసమైంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
యూఏఈ ఎమిరేట్స్‌లో ఒకటైన ఫుజైరాలోని చమురుకేంద్రంపై జరిగిన డ్రోన్‌ దాడిలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాపైనా ఇరాన్‌ విరుచుకుపడింది.  ఆ దేశంలో ప్రధాన చమురు కేంద్రాలకు నెలవైన తూర్పు ప్రాంతం లక్ష్యంగా పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. వెల్లువలాగా డ్రోన్లు వచ్చాయని, 35 డ్రోన్లను తాము అడ్డుకున్నామని సౌదీ అరేబియా ప్రకటించింది. తమ భూభాగం మీదికి కూడా ఇరాన్‌ డ్రోన్లను పంపించిందని ఇజ్రాయెల్‌ వెల్లడించింది.
ఇరాన్‌లో 7 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఆయిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తాము దాడులు చేయలేదని, ప్రధానంగా వాణిజ్య, మిలిటరీ కేంద్రాలపైనే దాడులు చేసినట్టు చెప్పారు. ఇరాన్‌లోని ఖర్గ్‌ ఐలాండ్‌లో ఆయిల్‌ పెసిలిటీస్‌ తప్ప మిగతా అన్నింటినీ ధ్వంసం చేశామని తెలిపారు.