కాబూల్ ఆస్పత్రిపై పాక్ దాడిలో 400 మంది మృతి 

కాబూల్ ఆస్పత్రిపై పాక్ దాడిలో 400 మంది మృతి 

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్‌లోని ఓ ఆస్పత్రిపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 400 మంది దుర్మరణం చెందారని.. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అఫ్గాన్ అధికారులు వెల్లడించారు.  మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స అందిస్తున్న ఓ పెద్ద ఆస్పత్రిపై జరిగిన వైమానిక దాడిలో భారీ ప్రాణనష్టం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్గానిస్థాన్​లోని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపిన వివరాల ప్రకారం, కాబూల్‌లో ఉన్న 2వేల పడకల సామర్థ్యం గల ఒమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆస్పత్రిపై రాత్రి సుమారు 9 గంటల సమయంలో వైమానిక దాడి జరిగినట్లు తెలిపారు. ఈ దాడి వల్ల ఆస్పత్రి భవనం పెద్ద భాగం పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. ఘటన తర్వాత ఆస్పత్రిలో భారీగా మంటలు చెలరేగడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.

దాడి జరిగిన సమయంలో ఆస్పత్రిలో వందల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స అందించే ప్రత్యేక కేంద్రంగా ఈ ఆస్పత్రి పనిచేస్తోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది అక్కడ ఉండటం వల్లే ప్రాణనష్టం అధికంగా జరిగిందని అఫ్గాన్ అధికారులు పేర్కొన్నారు. దాడి తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

ఆస్పత్రి భవనంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై అఫ్గానిస్థాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ సైన్యం ఈ వైమానిక దాడి జరిపిందని అఫ్గాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్‌ పూర్తిగా ఖండించింది. తమ సైన్యం పౌరులపై లేదా ఆస్పత్రులపై ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది.  పాకిస్థాన్‌ సైన్యం విడుదల చేసిన ప్రకటనలో తూర్పు అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే చర్యలు చేపట్టామని తెలిపింది. ఆస్పత్రులను లేదా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వచ్చే ఆరోపణలు అసత్యమని పేర్కొంది.

ఇక ఈ ఘటనపై అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అఫ్గానిస్థాన్​లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నరిచర్డ్ బెన్నెట్​ పౌరుల ప్రాణనష్టం కలిగిన ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.