ఎల్పీజీ గ్యాస్‌.. పెట్రోల్‌, డీజిల్‌కూ కొరత లేదు

ఎల్పీజీ గ్యాస్‌.. పెట్రోల్‌, డీజిల్‌కూ కొరత లేదు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్‌ సంక్షోభం నెలకొంది. కానీ ఇప్పటి వరకు భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు రాలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం విస్తృతంగా తప్పుడు ప్రచారం సాగుతుంది. దీంతో ప్రజలు గ్యాస్‌ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ముందు జాగ్రత్తగా గ్యాస్‌ సిలిండర్లు భద్రం చేసుకుంటున్నారు.
 
ఈ పరిస్థితులలో దేశంలో ఎల్పీజీ గ్యాస్‌ కొరత ఏర్పడిందని, త్వరలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,000 దాటుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారానికి తెరదించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్పీజీ స్టాక్ గృహావసరాలకు సరిపోయేంత ఉందని తెలిపింది. 
 
వంట గ్యాస్‌ సరఫరాపై పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్‌పీజీ సరఫరా చేస్తామని, అన్ని రాష్ట్రాల్లో ఎల్‌పీజీ స్టాక్‌ ఉందని ప్రకటించారు. హర్మూజ్‌ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని, శివాలిక్‌ నౌక సోమవారం  సాయంత్రం 5 గంటలకు భారత తీరానికి చేరుకుంటుందని తెలిపారు.
 
శివాలిక్‌ నౌకలో 48 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ ఉన్నట్లుగా వెల్లడించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మందితో కూడిన 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని తెలియజేసింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కూడా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్రం తెలిపింది. అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. 
 
పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టంచేసింది. పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ క్యారియర్ హార్మూజ్ జలసంధిని దాటి భారతదేశం సమీపానికి చేరుకుందని వెల్లడించింది. కాగా, భారతదేశం అంతటా ఇంధన సరఫరా స్థిరంగా ఉందని పేర్కొంది. ముడి చమురు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉందని సుజాత శర్మ వెల్లడించారు.

“దేశంలో తగినంత పరిమాణంలో ముడి చమురు అందుబాటులో ఉంది. అన్ని శుద్ధి కర్మాగారాలు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశంలో పెట్రోల్ పంపులు సాధారణంగా పనిచేస్తున్నాయి. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు నివేదికలు రాలేదు.” అని సుజాత శర్మ తెలిపారు.  రిటైల్ అవుట్‌లెట్‌లో ఇంధనం నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు.

కాగా, గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులందరికీ ఈ-కేవైసీని తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులందరూ బయోమెట్రిక్‌ ఆధార్‌ ఆథెంటికేషన్‌(ఈ-కేవైసీ) తప్పనిసరిగా చేసుకోవాలని మంత్రిత్వశాఖ ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నది.