రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే జోరు

రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే జోరు
* ఒడిశాలో క్రాస్ ఓటింగ్, బీహార్ లో ప్రతిపక్షం బేజార్ 

దేశంలోని 10 రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఏకగ్రీవమైన వారిలో ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలే, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ, అన్నాడీఎంకే నాయకుడు తంబిదురై, బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ తావ్డే, టీఎంసీ నేత బాబుల్ సుప్రియో ఉన్నారు. 

అయితే బిహార్, ఒడిశా, హరియాణా రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థులు బరిలో ఉండటంతో పోలింగ్ సోమవారం జరిగింది.  బిహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా, అందులో నాలుగు ఏకగ్రీవమయ్యాయి. బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, బిజెపి నాయకుడు శివేశ్ కుమార్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

అయితే ఐదో స్థానానికి ఎన్డీఏ రాష్ట్రీయ లోక్‌ జనతాదళ్ అధినేత ఉపేంద్ర కుశ్వాహాను నిలబెట్టింది. ఆర్జేడీ తరఫున అమరీంద్రదారి సింగ్ బరిలో నిలిచారు.నలుగురు ప్రతిపక్ష ఎమ్యెల్యేలు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో ఎన్డీయే అభ్యర్థి సునాయనంగా గెలుపొందారు. 

ఒడిశాలో 4 రాజ్యసభ సీట్లకు పోలింగ్ జరగగా రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మన్మోహన్ సమల్, సుజిత్ కుమార్ గెలుపొందారు. కాంగ్రెస్, బీజేడీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన దిలీప్ రాయ్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. నాలుగో స్థానంలో బీజేడీ నాయకుడు సంతృప్త్ మిశ్రా గెలిచారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త దాస్ స్పష్టం చేశారు. మరోవైపు, ఏడుగురు బీజేడీ ఎమ్మెల్యేలు సైతం క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన దిలీప్ రాయ్ గెలుపొందారు.

హరియాణాలో రెండు రాజ్యసభ స్థానాలకు  బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా, కాంగ్రెస్ అభ్యర్థి కరంవీర్ బోధ్ గెలుపొందారు. ఫలితాలు దాదాపు లాంఛనమే. అయినా స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందల్ రంగంలోకి దిగడంతో పోలింగ్ జరపాల్సి వచ్చింది. 

తమిళనాడులో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుచ్చి శివ (డీఎంకే), కాన్‌స్టంటైన్‌ రవీంద్రన్‌ (డీఎంకే), ఎల్‌.కె.సుదీశ్‌ (డీఎండీకే), క్రిస్టోఫర్‌ మాణిక్కం (కాంగ్రెస్‌), అన్నాడీఎంకే నేత తంబిదురై (అన్నాడీఎంకే), అన్బుమణి రామదాస్‌ (పీఎంకే) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు.  అలాగే తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలను ఎటువంటి పోటీ లేకుండా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్​ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అటు హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన ఏకైన సీటులో కాంగ్రెస్ అభ్యర్థి అనురాగ్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంగాల్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు  ఏకగ్రీవంగా అయ్యాయి. అందులో టీఎంసీ ఖాతాలో నాలుగు, బీజేపీ ఖాతాలో ఒక సీటు చేరింది. టీఎంసీ తరఫున రాష్ట్ర మంత్రి బాబుల్‌ సుప్రియో, బంగాల్‌ మాజీ డీజీపీ రాజీవ్‌ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్‌ మల్లిక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున రాహుల్ సిన్హా విజయం సాధించారు.

ఛత్తీస్‌గఢ్‌లో రెండు సీట్లను అధికార బీజేపీ దక్కించుకుంది. లక్ష్మిదేవీ వర్మ, పూలో దేవీ నేతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోంలోని మూడు స్థానాల్లో రెండు బీజేపీ గెలుపొందగా, మరొకటి మిత్రపక్షమైన యూపీపీఎల్‌కి దక్కింది.