వందేమాతరం గీతం సమయంలో అసెంబ్లీ నుండి ఎంఐఎం వాకౌట్ 

వందేమాతరం గీతం సమయంలో అసెంబ్లీ నుండి ఎంఐఎం వాకౌట్ 

జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలపించడం ప్రారంభం కాగానే, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) సభ్యులు తెలంగాణ అసెంబ్లీ నుండి సోమవారం వాకౌట్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా అధికారులు వందేమాతరం గీతాన్ని వినిపించారు. అయితే, ఈ చర్య  ఎఐఎంఐఎం  శాసనసభ్యుల నుండి నిరసనకు దారితీసింది. ఆ గీతం ముగిసిన తర్వాతే వారు తిరిగి సభలోకి వచ్చారు. 

 ‘వందేమాతరం’ గీతం ఆలపిస్తుండగా తెలంగాణ అసెంబ్లీ నుండి ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం నిరసన కాదని, అది మన జాతీయ గీతాన్ని బరితెగించి అవమానించడమే కాక, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, భారతమాత స్ఫూర్తిని అగౌరవపరచడమే అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారతీయులను ఏకం చేసే చిహ్నాల పట్ల ఎంఐఎం పదేపదే అగౌరవం ప్రదర్శించిందని పేర్కొంటూ తెలంగాణ ప్రజలు దీనిని నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు.

దేశం పట్ల, దాని చిహ్నాల పట్ల గౌరవం అనేది రాజీపడలేని విషయమని వారికి తెలుసు అని చెబుతూ ఈ విషయాన్ని స్పీకర్ గమనించి, తప్పు చేసిన ఎంఐఎం శాసనసభ్యులపై తగు చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా లో ఉంచుతూ వారి చర్యను “సిగ్గుచేటైన చర్య”గా అభివర్ణించారు.  ఆ పార్టీ సభ్యులు జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపించారు. 

“వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో  ఎఐఎంఐఎం  ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడం సిగ్గుచేటు. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు. ఇది జాతీయ గీతానికి మరియు మన మాతృభూమి స్ఫూర్తికి జరిగిన ప్రత్యక్ష అవమానం,” అని ఆయన ‘ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ వీడియోలో, తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ” వినిపిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా వివిధ పార్టీలకు చెందిన మంత్రులు నిలబడి ఉండటం కనిపిస్తుంది.  వందేమాతరం ప్రారంభం కాగానే,  ఎఐఎంఐఎం  నాయకులు గుంపుగా అసెంబ్లీ నుండి బయటకు వెళ్లడం కనిపించింది. 

జాతీయ గేయం ‘వందేమాతరం’ పట్ల మజ్లిస్ పార్టీ ప్రదర్శించిన అగౌరవాన్ని యావత్ సమాజం గమనిస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు.  తెలంగాణ అసెంబ్లీలో వందేమాతరం ఆలాపన జరుగుతుండగా, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా సభ నుండి వాకౌట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. అసలు వీరి విధేయత ఎవరి పట్ల ఉంది? అని ప్రశ్నించారు.

సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా వీరి నాయకుడు “జై పాలస్తీనా” అని నినాదాలు చేసిన తీరును దేశ ప్రజలు ఎలా విస్మరించగలరు? ఇలాంటి చర్యలు, దేశం పట్ల వారికి ఉన్న గౌరవంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జాతీయ ప్రతీకలను అవమానించడాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ హర్షించదు” అని స్పష్టం చేశారు.  జాతీయ గీతం పట్ల అగౌరవం ప్రదర్శించినందుకు గాను ఈ చర్యపై విస్తృత విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వాకౌట్‌కు సంబంధించి ఆ పార్టీ నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

అసెంబ్లీలో వందేమాతరం ఆలపించడంపై  ఎఐఎంఐఎం నాయకులు గతంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిధిని దాటిన అంశాలు ఇందులో ఉన్నందున, దీనిని ఆలపించాల్సిన బాధ్యత తమకు లేదని పాట్నా ఎమ్మెల్యే వారిస్ పఠాన్ గతంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న, అధికారిక కార్యక్రమాలలో “వందేమాతరం”లోని మొత్తం ఆరు చరణాలను వినిపించాలని లేదా ఆలపించాలని, కొన్ని సందర్భాల్లో జాతీయ గీతానికి ముందు దీనిని వినిపించాలని, అలాగే ఇది వినిపిస్తున్నప్పుడు ప్రజలు తప్పక నిలబడాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 

ముస్లిం లీగ్‌ను బుజ్జగించే ఉద్దేశంతో 1937లోనే కాంగ్రెస్ నాయకత్వం ఈ గీతంలోని కీలక చరణాలను తొలగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించగా, తర్వాతి చరణాలలో కొన్ని మతపరమైన అంశాలు ఉన్నందున అవి కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని భావించి, కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే స్వీకరించామని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది.