నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ప్రముఖ తెలుగు కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.కరోనా సమయంలో సమాజంలోని వేదన, భయం, మానవీయ కోణాలను వ్యక్తపరుస్తూ సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ గ్రంథానికి గాను ఈ అవార్డు ప్రకటించినట్లు అకాడమీ తెలిపింది.  2025 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను సోమవారం ప్రకటించారు.
మొత్తం 24 భారతీయ భాషల్లోని ఉత్తమ రచనలకుగాను ఈ అవార్డులను ఖరారు చేసినట్లు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లెటర్స్‌ వెల్లడించింది.  ”ఈ ఏడాది అవార్డు గెలుచుకున్న వాటిలో 8 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 కథానికలు, 2 వ్యాస సంపుటాలు, 1 సాహిత్య విమర్శ గ్రంథం, 1 ఆత్మకథ, 2 జ్ఞాపకాలు (మెమోయిర్స్‌) ఉన్నాయి” కేంద్ర సాహిత్య అకాడమీ పేర్కొంది.
విజేతలకు 2026 మార్చి 31న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో శాలువా కప్పి, ఈ ప్రతిష్ఠాత్మ పురస్కారాన్ని (తామ్ర పత్రం), ఒక లక్ష నగదును అందించనున్నామని తెలిపింది. ‘నందిని సిధారెడ్డి’ కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎంపిక కమిటీలో డా.ఎన్.గోపి, డా.కోయి వెంకటేశ్వరరావు, డా.మధురాంతకం నరేంద్ర ఉన్నారు. కరోనా దుఃఖాన్ని 19 గాథలుగా రాసిన ఆయన ఆర్తికి సముచితమైన పురస్కారం ఇది.

నందిని సిధారెడ్డి తెలంగాణలో 1955 జూన్‌ 12న జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్‌ యోధుడు. తల్లి రత్నమాల. భార్య మల్లీశ్వరి. సిద్ధిపేటలో పాఠశాల విద్యను పూర్తి చేసి, హైదరాబాద్‌ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. తరువాత మెదక్‌, సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు లెక్చరర్‌ గా పనిచేశారు. 2012లో పదవీ విరమణ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో ప్రభుత్వం ఆయనను తెలంగాణ సాహిత్య అకాడమీకి మొదటి ఛైర్మన్‌ గా నియమించింది. 1997లో ‘నాగేటి చాల్లల్ల’ అనే కవిత తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచింది.  ఆయన భూమిస్వప్నం, ఇగురం, ఆవర్థనం, కుల వృత్తులు, ప్రాణహిత వంటి అనేక రచనలు చేశారు. తాజాగా ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 వరించింది.

అంతకు ముందు నాగేటి చాల్లల్ల అనే పాటకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు (2010) వచ్చింది. 2001లో ప్రాణహిత కవితా సంకలనానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు పురస్కారం అందించారు. 1988లో దాశరథి పురస్కారం లభించింది. “ప్రపంచ దుఃఖాన్ని నా కష్టంగా భావించాను. అందుకే అనిమేష రాశాను. నా సాహిత్య ప్రయాణమే ప్రపంచంలోని దుఃఖాలను తొలగించి ఉన్నత సమాజంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభించాను” అవార్డు గురించి ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చారు.