మారుమూల గిరిజన ప్రాంతాలు, సరిహద్దుల్లో కూడా ఆర్ఎస్ఎస్ విస్తరణ

మారుమూల గిరిజన ప్రాంతాలు, సరిహద్దుల్లో కూడా ఆర్ఎస్ఎస్ విస్తరణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సందర్భంగా  సంస్థాగత కార్యకలాపాల విస్తరణకు చేసిన ప్రత్యేక ప్రయత్నాలు కారణంగా ఇప్పుడు మారుమూల గిరిజన ప్రాంతాలకు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా సంఘ్ శాఖలు ప్రారంభం అయ్యాయని సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబాలే తెలిపారు.  అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, లేహ్, మారుమూల గిరిజన ప్రాంతాల వంటి ప్రదేశాలలో కూడా ఇప్పుడు శాఖలను నిర్వహిస్తున్నారని, ఈ ప్రాంతాలలో సంఘ్ ఉనికిని బట్టి కూడా సంస్థాగత విస్తరణను పరిగణించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 
మూడు రోజుల పాటు  హర్యానాలోని సమల్ఖా (పానిపట్)లో జరిగిన ఆర్ఎస్ఎస్ ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ సమావేశాలు ముగింపు సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంస్థాగత కార్యకలాపాలను విస్తరించడం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సమాజంలోని సానుకూల శక్తులు మరింత చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం అనే సంకల్పంతో సమావేశాలు ముగిసినట్లు చెప్పారు. 
 
గత ఏడాది కాలంలో సంఘ్ శాఖల సంఖ్య దాదాపు ఆరు వేలు పెరిగి, ప్రస్తుతం 88,000 మార్కును అధిగమించిందని, శాఖలు నిర్వహిస్తున్న ప్రదేశాల సంఖ్య కూడా 55,000కు పైగా పెరిగిందని తెలిపారు. వీటితో పాటు, ‘సాప్తాహిక మిలన్’లు, ‘మండలి’ల సంఖ్య కూడా పెరిగిందని వివరించారు.  అండమాన్‌లో, తొమ్మిది ద్వీపాలకు చెందిన 13,000 మందికి పైగా ప్రజలు ఒక ‘హిందూ సమ్మేళనం’లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ హాజరయ్యారు.
అదేవిధంగా, తక్కువ జనసాంద్రత కలిగిన అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో, 21 ‘స్వధర్మ సమ్మేళనాల’లో 37,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. సర్ కార్యవాహ ప్రకారం, సంస్థాగత విస్తరణతో పాటు, కార్యకర్తలలో నాణ్యతను పెంపొందించడానికి సంఘ్ నిరంతరం కృషి చేస్తోంది.
 
మరోవంక,  ‘పంచ పరివర్తన’ భావన ద్వారా సానుకూల సామాజిక మార్పును ప్రేరేపించేందుకు అత్యంత ముఖ్యమై ప్రయత్నం చేస్తున్నట్లు  దత్తాత్రేయ హోసబళే తెలిపారు.  ‘భారతీయత’ లేదా ‘హిందుత్వ’ అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని, దీని ద్వారా సమాజ విలువలు మరియు నాణ్యత విస్తరించాలని ఆయన పేర్కొన్నారు.
 
ఈ లక్ష్యంతో, సమాజంలోని సానుకూల, సదుద్దేశం కలిగిన శక్తులను ఏకం చేయడం, అలాగే జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేసేలా ‘మంచితనపు శక్తి’ని  ప్రోత్సహించడం అత్యవసరం అని తెలిపారు. కుల, మత విభేదాలకు అతీతంగా నిలిచి, మహనీయుల కృషిని, సేవలను సమాజం స్వీకరించాలని, వారి స్ఫూర్తితో సానుకూల మార్పు దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
 
జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని కూడా ఈ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సంత శిరోమణి రవిదాస్ జీ మహారాజ్ వారి 650వ జయంతిని పురస్కరించుకుని, రాబోయే సంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే సంవత్సరానికి ప్రణాళిక చేసిన సాధారణ శిక్షణా శిబిరాల వివరాలను వెల్లడిస్తూ, మొత్తం 96 శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు దత్తాత్రేయ హోసబాలే చెప్పారు.
వీటిలో 11 ప్రాంతాలలో, నాగపూర్‌లో ఒకటి చొప్పున శిబిరాలు ఉంటాయని తెలిపారు. గో-సేవ, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై కూడా ‘ప్రతినిధి సభ’ చర్చించిందని ఆయన వివరించారు.  ప్రతి ఒక్కరూ గో-సేవకు, సుస్థిర గ్రామాభివృద్ధికి అర్థవంతంగా తోడ్పడేలా, పౌరులు తమ ఇంటి పైకప్పులపై కూరగాయల తోటలను పెంచడానికి, స్వదేశీ ఆవుల పేడతో తయారైన ఎరువును ఉపయోగించడానికి ప్రోత్సహిస్తామని తెలిపారు.
పాలిథిన్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా ‘హరిత గృహాలను ‘నిర్మించుకుంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేయవచ్చని కూడా ఆయన సూచించారు.  సంఘ్ సంస్థాగత నిర్మాణంలో మార్పులకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, నిర్మాణంలో వికేంద్రీకరణ అంశంపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ‘ప్రాంతాల’ స్థానంలో ‘సంభాగ్’ అనే చిన్న విభాగాలు ఏర్పాటు కావచ్చు. ఇది అమలైన తర్వాత, ప్రస్తుతం ఉన్న 46 ప్రాంతాలకు బదులుగా 80కి పైగా సంభాగ్ విభాగాలు ఏర్పడతాయి. 
 
మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, సమాజంలో కుల ఆధారిత విభజనలను తొలగించడానికి, ఎన్నికల సమయంలో కుల ప్రాతిపదికన ఓటర్ల సంఖ్యను అంచనా వేయడాన్ని ఆపడానికి మీడియా కూడా ముందుకు రావాలని సర్ కార్యవాహ  పిలుపునిచ్చారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాల కోసం దేశ ప్రభుత్వం చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలను ఆయన అభినందించారు. ప్రపంచంలో శాంతి, అభివృద్ధిని సంఘ్ కాంక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. 
 
మరొక ప్రశ్నకు బదులిస్తూ, డాక్టర్ హెడ్గేవార్ సంఘ్‌ను ఏ ఒక్క వర్గానికి లేదా ఆరాధనా విధానానికి వ్యతిరేకంగా స్థాపించలేదని ఆయన స్పష్టం చేశారు. రెండవ సర్ సంఘచాలక్ అయిన  గురూజీ కూడా, ప్రజలందరికీ ఉమ్మడి పూర్వీకులే ఉన్నారని, ఆరాధనా పద్ధతుల్లోని తేడాలు విభజనలకు దారితీయవని పేర్కొన్నారని చెప్పారు. అప్పట్లో “డీఎన్ఏ” అనే పదాన్ని ఉపయోగించకపోయినప్పటికీ, ఆయన చెప్పిన భావం మాత్రం అదేనని వివరించారు.
 
అదేవిధంగా, మూడవ సర్ సంఘచాలక్ అయిన బాలాసాహెబ్ దేవరస్ కూడా, భారత్‌ను తమ మాతృభూమిగా, దేశంగా భావిస్తూ, ‘భారతీయత’ స్ఫూర్తితో జీవించే వారందరూ హిందువులేనని ప్రకటించారని చెప్పారు. సంఘ్‌లోకి ఎవరికైనా స్వాగతం ఉంటుందని, సమాజం కోసం మంచి పనులు చేసే ఎవరినైనా ‘సంఘ్ స్వయంసేవక్’గానే పరిగణిస్తారని ఆయన స్పష్టం చేశారు.