డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ .. టిటిడి లో పెను దుమారం

డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ .. టిటిడి లో పెను దుమారం
 
* అసభ్య వీడియోలతో చిక్కిన టిటిడి చైర్మన్ బివి నాయుడుపై మౌనం!
 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్‌ కేసులో ఏలూరు టిడిపి ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ పట్టుబడటం, డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో అరెస్ట్ చేసి ఆయనను స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేయడం టిడిపిలో కలకలం చెలరేగుతుంది. రాష్ట్రం నుండి డ్రగ్స్ లేకుండా చేయాలనీ భారీ కార్యక్రమాలు చేబడుతున్న టిడిపి ప్రభుత్వంను ఆత్మరక్షణలోకి నెట్టివేసిన్నట్లు అయింది. 
వెంటనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ కావడం, వివరణ కోరుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేయడం జరిగింది. ఈ కేసు తేలేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 
 
అయితే, కొద్ది రోజుల క్రితం పవిత్రమైన టిటిడి బోర్డు చైర్మన్ గా ఉంటున్న బివి నాయుడు ఓ మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించినట్లు వీడియోలు, కధనాలు వచ్చిన్నప్పటికీ పార్టీ పట్టించుకోకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయమని మంత్రి లోకేష్ కు సన్నిహితులు కొందరు బివి నాయుడుకు సూచించినా ఆయన స్పందించలేదని ప్రచారం జరుగుతుంది. 
 
తిరుమల పవిత్రతను మంటగరిపారని స్వయంగా ముఖ్యమంత్రి, టీడీపీ నేతలు నిత్యం విమర్శలు గుప్పిస్తున్న మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న సినీ నటుడు పృథ్వి అనుచితంగా ఓ మహిళతో టెలిఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడి కావడంతో వెంటనే రాజీనామా చేయించారు. ఇప్పుడు వీడియోలు విడుదలైనా పట్టించుకోరే? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
పైగా,  పుట్టా మహేష్  ఘటనపై నివేదిక కోరిన చంద్రబాబు డ్రగ్స్ వంటి ఘటనలలో ఎవరు ఉన్నప్పటికీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కొంతమంది నేతలు, వ్యక్తులు చేసే తప్పులతో పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వబోనని పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తనపై వచ్చిన ఆరోపణలపై 48 గంటల్లోపు మీ లిఖితపూర్వక వివరణను పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి అందజేయాలని మహేష్ ను కోరారు. 
 
గడువులోపు తగిన వివరణ అందించని పక్షంలో పార్టీ నియమావళి ప్రకారం తగిన చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించడం కూడా జరిగింది. మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరు టిడిపి ఎమ్యెల్యే కాగా, గతంలో టిడిపి హయాంలో టిటిడి చైర్మన్ గా పనిచేశారు. ఆయన, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడుకు వియ్యంకుడు. 
 
 కాగా, డ్రగ్స్ కేసులో అరెస్టైన పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. హైదరాబాద్ మొయినాబాద్ లో జరిగిన జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ  పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ   మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.  తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
 

‎కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్ళానని, కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని చెబుతూ వాటిని ఎవ్వరూ నమ్మవద్దని కోరారు. పోలీసు విచారణకు సహకరిస్తానని, పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని ఎంపీ తన ప్రకటనలో తెలిపారు.  

 
ఇలా ఉండగా, డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, మహేశ్‌ను పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మహేశ్‌పై చర్యలు తీసుకుని డ్రగ్స్ నివారణలో తమ చిత్తశుద్దిని తెలుగుదేశం పార్టీ నిరూపించుకోవాలని ఆయన సూచించారు.  కాగా డ్రగ్స్ పార్టీలో  పట్టబడి రాజ్యాంగబద్ధమైన తన పదిని దుర్వినియోగం చేశారని, తక్షణమే మహేష్ పదవికి ఎంపీ రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.