ఒడిశాలో 11 మంది, ఛత్తీస్‌గఢ్‌‌లో 108 మంది నక్సల్స్ లొంగుబాటు

ఒడిశాలో 11 మంది, ఛత్తీస్‌గఢ్‌‌లో 108 మంది నక్సల్స్ లొంగుబాటు
ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆదివారం 11మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో డివిజనల్‌ కమిటీ సభ్యుడు (డిసిఎం) నకుల్‌ కూడా ఉన్నారని, అతనిపై రూ.22లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన 10మంది మావోయిస్టులు నిషేధిత సిపిఐ (మావోయిస్ట్‌)లోని (బన్సధార, ఘుమ్సర్‌, నాగావళి) బిజిఎన్‌ విభాగానికి చెందినవారని పేర్కొన్నారు. 
 
వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు కాగా, మరో ఐదుగురు పార్టీ కేడర్స్‌ అని, వారిపై మొత్తంగా రూ.63.25లక్షల రివార్డు ఉందని కలహండి డిజిపి వై.బి. కురానియా తెలిపారు. ఎకె47 రైఫిల్‌, ఇన్సాస్‌ రైఫిల్‌, నాలుగు సెల్ఫ్‌-లోడెడ్‌ రైఫిల్స్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌), నాలుగు సింగిల్‌ షాట్‌ ఆయుధాలు, 12-బోర్‌ గన్‌తో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేశారని చెప్పారు. 
 
డిసిఎం నకుల్‌ మహారాష్ట్రకు చెందినవారుకాగా, మిగిలిన వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని చెప్పారు.  ఈ 11 మంది నక్సలైట్లపై ప్రభుత్వం గతంలో 1 కోటి 34 లక్షల రూపాయల భారీ నగదు బహుమతిని (ఇనామ్) ప్రకటించింది. కాగా, గత బుధవారం ఛత్తీస్‌గఢ్‌‌లోని జగదల్‌పుర్‌లో ఏకంగా 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. లొంగిపోయిన వారిలో 44 మంది మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు వీరి నుంచి భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు. అందులో 3.61 కోట్ల రూపాయల నగదు. 1.64 కోట్లు విలువ చేసే బంగారం ఉంది. ఇక, లొంగిపోయిన వారిపై 3.29 కోట్ల రూపాయల రివార్డు ఉంది.