మహిళల ధైర్యానికి, ఆత్మగౌరవానికి ‘జౌహర్’ ప్రతీక

మహిళల ధైర్యానికి, ఆత్మగౌరవానికి ‘జౌహర్’ ప్రతీక

చిత్తోర్‌గఢ్ కోటలో రాణి పద్మావతి త్యాగం మహిళల, దేశ గౌరవాన్ని కాపాడాలనే సంకల్పాన్ని సూచిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాజస్థాన్ చిత్తోర్‌గఢ్​లో ఆదివారం జరిగిన ‘జౌహర్ శ్రద్ధాంజలి’ కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఆయన మేవార్ మహిళలు చేసిన చరిత్రాత్మక జౌహర్, తమ ఆత్మగౌరవం, దృఢ సంకల్పాన్ని సూచిస్తుందని కొనియాడారు.

ఈ నేపథ్యంలో ఉత్తర్​ ప్రదేశ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల గౌరవం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం నేరాలు, నేరస్థుల పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో ఈ మార్పులు రాజస్థాన్ పరాక్రమం, సంప్రదాయాలకు నెలవైన మేవార్, చిత్తోర్‌గఢ్ వారసత్వం నుంచే వచ్చాయని చెప్పారు. 

ఈ ప్రాంత ధైర్యం, వీరత్వాన్ని గుర్తుచేసుకున్నప్పుడల్లా యోధుల శౌర్యం, ధైర్యవంతులైన మహిళల త్యాగాల కథల గురించే మాట్లాడుకుంటారని తెలిపారు. మేవార్ మహిళల జౌహర్, మీరాబాయి భక్తిని గుర్తుచేసుకుంటూ అలాంటి సంప్రదాయాలు దేశానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. “గతంలో అనేకమంది బాలికలు తమ చదువులను కొనసాగించడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లి తమతమ బంధువుల ఇళ్లలో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్లు తమ సొంత ఇంట్లో ఉంటూనే చదువుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించగలుగుతున్నారు” అని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. 

“ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఆడ బిడ్డలు, సోదరీమణులు ఇప్పుడు అఫీసులు, ఫ్యాక్టరీలల్లో రాత్రి షిఫ్టుల్లో కూడా పని చేస్తూ, సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఇది మా రాష్ట్రంలో మహిళల మెరుగైన భద్రతా వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది” అని యోగి చెప్పారు. అంతకుముందు కోటలోని జౌహర్ స్థలాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్​తో కలిసి కాళికామాత ఆలయంలో కూడా ప్రార్థనలు చేశారు.
 
యుద్ధ భూమిలో ఓటమి తప్పదని భావించిన సమయంలో శత్రువులకు బంధీలుగా లొంగిపోకుండా ఉండేందుకు మహిళలు, బాలికలు సామూహికంగా ఆత్మాహుతి చేసుకునే చారిత్రక ఆచారాన్నే జౌహర్ అంటారు. 1303లో రాజస్థాన్​ చిత్తోర్‌గఢ్‌ను అల్లావుద్దీన్ ఖిల్జీ ముట్టడించినప్పుడు రాణి పద్మావతి (పద్మిని) శత్రువులకు చిక్కకుండా, తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి దాదాపు 13వేల మంది పవిత్ర అగ్నిలో తమ ప్రాణాలను అర్పించుకున్నారు.  చిత్తోర్‌గఢ్‌ చరిత్రలో అత్యంత విషాదకరమైన, వీరోచితమైన త్యాగం. అలా రాజపుత్ర మహిళల ఆత్మగౌరవం, శౌర్యానికి ఈ చరిత్రాత్మక సంఘటన చిహ్నంగా నిలిచింది.