సౌదీలో ఉన్న భారతీయులకు కీలక హెచ్చరిక 

సౌదీలో ఉన్న భారతీయులకు కీలక హెచ్చరిక 

* ఇరాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న విద్యార్థులు

ప్రస్తుత మధ్యప్రాచ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం  సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారాలు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

ప్రత్యేకంగా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు లేదా వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదా రీషేర్ చేయడం నుంచి దూరంగా ఉండాలని ఎంబసీ స్పష్టం చేసింది. ఇక రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని భారత కాన్సులేట్ కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అవసరమైతే తాజా సమాచారం, సూచనలు కూడా విడుదల చేస్తామని చెప్పారు.

అలాగే కౌన్సులర్ క్యాంప్స్ కూడా సాధారణంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విమాన ప్రయాణానికి సంబంధించి జెడ్డా, మదీనా నుంచి భారతదేశానికి విమానాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. సౌదీ ఎయిర్‌లైన్స్ రియాద్,  దమ్మాం నుంచి కూడా భారత నగరాలకు విమానాలు నడుపుతున్నాయి. ఇక భారత ఎయిర్‌లైన్స్ కూడా రియాద్ నుంచి తమ సేవలను తిరిగి ప్రారంభించాయి.  భారతదేశానికి ప్రయాణించాలనుకునే వారు ముందుగా టికెట్ అందుబాటును చెక్ చేసుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి ఎంబసీ 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లు కూడా విడుదల చేసింది. సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులు ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా ఫాలో అవుతూ తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

మరోవంక, యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఆదివారం 70 మందికిపైగా భారతీయ విద్యారులు ఇరాన్‌ నుంచి దుబాయ్‌కు వచ్చి, అక్కడ్నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఇరాన్‌కు వెళ్లిన వీళ్లంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకోవటంతో, భారత ప్రభుత్వ సమన్వయంతో విద్యార్థులను సురక్షితంగా తరలించే ప్రక్రియను ఇరాన్‌లోని మన రాయబార కార్యాలయం చేపట్టింది. ఇందులో అత్యధిక మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన వాళ్లే ఉన్నట్టు మీడియా కథనాలు తెలిపాయి. వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత తమ స్వస్థలాలకు బయల్దేరారు. ఆల్‌ ఇండియా మెడికల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మహమ్మద్‌ మోమిన్‌ ఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం, టెహ్రాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సుమారు 1,200 మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు.