కటక్‌ హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

కటక్‌  హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి
 
* రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్బ్రాంతి 
ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల ఎస్‌సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూ విభాగంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.   సోమవారం తెల్లవారుజామున సుమారు 2.30 నుంచి 3 గంటల మధ్య రోగులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ముఖ్యంగా అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 23 మంది రోగులను ఇతర వార్డులకు తరలించే ప్రయత్నం చేశారు.  కానీ అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఏడుగురు రోగులు పొగను బాగా పీల్చుకుని ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూడా పొగను లోపలికి ఎక్కువగా పీల్చుకుని చికిత్స పొందుతూ చనిపోయారు.
మరోవైపు రోగులను మంటల నుంచి కాపాడే క్రమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన 11 మంది సిబ్బందికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. పొగ పీల్చడం వల్ల మరో 23 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.  ప్రమాద వార్త తెలియగానే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించారు.
అలాగే మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ. 25 లక్షల చొప్పున భారీ పరిహారాన్ని ప్రకటించారు.  అయితే ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్న రోగులు బయటకు రాలేక.. ఊపిరి ఆడక మరణించారు.  గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
కటక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. “ఒడిశాలోని కటక్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ముర్ము ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. “ఒడిశాలోని కటక్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్  నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుంది” అని పిఎంఓ ఒక ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది.