ఎస్ఐఆర్ బీజేపీ కొత్తగా తెచ్చిన పథకం కాదు

ఎస్ఐఆర్ బీజేపీ కొత్తగా తెచ్చిన పథకం కాదు
 
ఎస్ఐఆర్ అనేది బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకం కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. ఇది 2002 నుండి అమల్లో ఉందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇది జరిగిందని వివరించారు. ఈసారి ఆధునిక టెక్నాలజీ వినియోగించడం వల్ల ఓటర్ల జాబితాలో అనర్హుల తొలగింపు ప్రక్రియ పారదర్శకతతో జరుగుతోందని చెప్పారు.
 
విజయవాడలో ఎస్ఐఆర్‌పై ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) అనేది ప్రతి ఏటా జరిగే నిరంతర ప్రక్రియ అని, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల తొలగింపు ప్రక్రియ జరుగుతూ ఉంటుందని తెలిపారు.  బీహార్ ఎన్నికల సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని గుర్తు చేశారు. 
 
ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేశాయని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో ఈ అంశంపై స్పష్టతనిస్తూ ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్‌పై చర్చించామని పేర్కొంటూ న్యూఢిల్లీలోని ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం ముందు గత మూడు రోజులుగా ధర్నా జరుగుతోందని తెలిపారు. 
 
ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, మరో 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభం కాబోతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సైతం చురుగ్గా పాల్గొనేల ఈ యజ్ఞాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా అందరూ కృషి చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ పిలుపునిచ్చారు.  వ్యవస్థలో అందరూ భాగస్వామ్యం పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేశామని చెప్పా రు.
జిల్లా అధ్యక్షులు, జోనల్ ఇన్‌ఛార్జ్‌లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కలిపి బీఎల్‌ఏ 1లను నియమించామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్ల కోసం ఎంత కష్టపడతారో, అంతకంటే ఎక్కువగా ఈ 90 రోజులు పనిచేయాలని బీఎల్ఏ 1లకు ఆయన సూచించారు.  మనమందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై ఇప్పటికే నేషనల్ వర్క్‌షాప్ ఢిల్లీలో పూర్తయిందని తెలిపారు.
విజయవాడ వేదికగా జరగనున్న స్టేట్ వర్క్‌షాప్‌లో శ్రీకాంత్ శర్మ ప్రెజెంటేషన్ ఇస్తారన్నారు. దేశవ్యాప్తంగా జరగబోయే ఈ ప్రక్రియలో మన భాగస్వామ్యం చాలా కీలకమనేది అందరూ‌ గుర్తుంచుకోవాలని బీఎల్ఏలకు మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీ డి పురందేశ్వరి, పార్టీ ఎమ్యెల్యేలు, ఎంఎల్సీలు పాల్గొన్నారు.