‘ఇగ సహించదు తెలంగాణ’ – సేవ్ తెలంగాణ పోస్టర్

‘ఇగ సహించదు తెలంగాణ’ – సేవ్ తెలంగాణ పోస్టర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు ‘ఇగ సహించదు తెలంగాణ’ – సేవ్ తెలంగాణ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిపాలనా వైఫల్యాలు, ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడుతామని రాంచందర్ రావు ఈ సందర్భంగా ప్రకటించారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపి నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, ఎన్.వి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  రాంచందర్ రావు మాట్లాడుతూ  తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా అందడం లేదని, పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వడం లేదని, వృద్ధులకు పెన్షన్లు సకాలంలో అందించకపోవడంతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల పెంపు కూడా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

ఈ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేలా ఈ పోస్టర్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రకటించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 999 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. 
ఈ 999 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య, ప్రజావ్యతిరేక, వైఫల్య పాలనకు వ్యతిరేకంగా బిజెపి ఆధ్వర్యంలో పోరుబాట ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
మార్చి 16న మండల కేంద్రాల్లో బిజెపి కార్యకర్తలు మండల ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పిస్తారని, అదేవిధంగా మార్చి 20న జిల్లా కేంద్రాల్లో అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 
తదుపరి కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వాదం అందించాలని కోరుతూ, ప్రజల పక్షాన పోరాడి వారి హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.