బెంగాల్‌లో రెండు విడతలు, నాలుగు చోట్ల ఒకే దశలో పోలింగ్

బెంగాల్‌లో రెండు విడతలు, నాలుగు చోట్ల ఒకే దశలో పోలింగ్

పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. బెంగాల్‌లో రెండు దశల్లోనూ, మిగతా చోట్ల ఒకే విడతలో ఎన్నికలు జరగున్నాయి. అసోం, కేరళ, పుదుచ్చేరిిలో ఏప్రిల్ 9న, పశ్చిమ్ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది.

అన్ని రాష్ట్రాల్లోనూ మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని ఈసీ పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు చెప్పింది. కాగా, షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 20 దేశాల ఎన్నికల సంఘాలు, మన ప్రజాస్వామ్య ప్రక్రియలను పరిశీలించడానికి, మన నుండి నేర్చుకోవడానికి భారత్ కు వస్తాయని చెప్పారు.

మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23న తొలి దశలో 152 స్థానాలకు, ఏప్రిల్ 29న 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్, కేరళలోని 140 అసెంబ్లీ సీట్లకు, అసోంలోని 126 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న ఓటింగ్ జరుగుతుంది.

ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 824 సీట్లు ఉండగా, 17.4 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమ్ బెంగాల్‌లో 6.44 కోట్ల మంది, తమిళనాడులో 5.67 కోట్ల మంది, కేరళలో 2.70 కోట్ల మంది, అసోంలో 2.50 కోట్లు, పుదుచ్చేరిలో 9.44 కోట్ల ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, అసోంలో బీజేపీ, కేరళలో ఎల్డీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే అధికారంలో ఉన్నాయి.

పశ్చిమ్ బెంగాల్‌లో గెలుపు కోసం బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 77 సీట్లలో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక, మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ వరుసగా నాలుగోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటోంది. ఇక, వీటితో పాటు ఆరు రాష్ట్రాల్లోని 8 శాసనసభ స్థానాలకు ఉప-ఎన్నికలు జరగనున్నాయి. గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, నాగాలాండ్‌లో పలు కారణాలతో 8 స్థానాలు ఖాళీ ఏర్పడటంతో వాటికి ఉప-ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో ఉప-ఎన్నిక వచ్చింది.

ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు పార్టీల నేతలతో ఈసీ భేటీ జరిగింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పార్టీల నేతల సలహాలు, సూచనలు స్వీకరించామని, జిల్లా ఎలక్టోరల్‌ అధికారులు, ఎస్పీలు, ఐజీలు, డీఐజీలతోనూ భేటీ జరిగిందని తెలిపారు. 

ఎస్‌ఐఆర్‌కు సంబంధించి బీఎల్‌వోలకు మౌలిక సదుపాయాలు కల్పించామని, పారదర్శక, నిష్పాక్షికంగా ఎన్నికల కోసమే ఎస్‌ఐఆర్‌ నిర్వహణ చేస్తున్నమని సీఈసీ స్పష్టం చేసింది. పారదర్శక, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని చెబుతూ యువత ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కోరారు.