మమత సర్కార్ కు కౌంట్ డౌన్ – బెంగాల్ లో ‘మార్పు’ అనే తుపాను

మమత సర్కార్ కు కౌంట్ డౌన్ – బెంగాల్ లో ‘మార్పు’ అనే తుపాను

బెంగాల్ కు ‘మహా జంగిల్రాజ్’ పాలనను తీసుకొచ్చిన వారికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నిరంకుశ టీఎంసీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ‘మార్పు అనే తుపాను’ను ఆపలేదని స్పష్టం చేశారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లోని భారీ జనసమూహమే ఇందుకు నిదర్శనమని చెబుతూ బెంగాల్ లో మళ్లీ చట్టబద్ధమైన పాలన వస్తుందని, అప్పుడు దురాగతాలకు పాల్పడిన టీఎంసీ నాయకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

“టీఎంసీ ప్రభుత్వం తాను పనిచేయదు, ఇతరులు పనిచేయడానికి అనుమతించదని, అందుకే బెంగాల్ లో అనేక కేంద్ర పథకాలు నిలిచిపోయాయని’ మోదీ ఆరోపించారు. బంగాల్లో మార్పు ఆసన్నమైందని గ్రహించిన టీఎంసీ కలవరపడుతోందని ఎద్దేవా చేశారు. అందుకే ఈ ర్యాలీకి రాకుండా ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 

అయితే ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ ప్రజలు ర్యాలీకి హాజరుకాకుండా మమతా సర్కార్ ఆపలేకపోయిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, టీఎంసీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి రక్షణ కల్పిస్తోందని, ఇందుకు సందేశ్ ఖలి, ఆర్జీ కర్ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. టీఎంసీ ప్రజావ్యతిరేక విధానాల వల్ల, చంద్రకోనకు చెందిన బంగాళాదుంప రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగాల్ లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం ఈ బంగాల్ నుంచే లిఖించబడుతోందని తెలిపారు.  అలాగే ఖరగ్పూర్-మోరెగ్రామ్ ఎకనామిక్ కారిడార్కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.  

హల్దియా డాక్ కంప్లెక్స్లో 2వ బెర్త్ యాంత్రీకరణ (మెకనైజేషన్)ను, ఖిద్దార్పూర్ డాక్స్ పునరుద్ధరణ ప్రాజెక్టును, అలాగే కోల్కతాలోని బాస్కుల్ బ్రిడ్జ్ మరమ్మతు పనులకు కూడా ప్రారంభించారు. 
అంతకు ముందు, అసోంలోని సిల్చార్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ, కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బరాక్ వ్యాలీకి సముద్ర మార్గం లేకుండా సరిహద్దు గీశారని, దీని వల్ల ఆ ప్రాంతానికి సముద్ర మార్గం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల తలెత్తే ప్రభావాలు దేశ ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. అయితే భారత్ సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలు బొమ్మగా మారిందని, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, యుద్ధవాతావరణం నెలకొన్న తరుణంలో, బాధ్యతారాహిత్యంగా దేశంలో భయాందోళనలు సృష్టించేదుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

‘కాంగ్రెస్ పార్టీకి అసోం గురించి గానీ, దేశం గురించి గానీ ఎలాంటి విజన్ (దూరదృష్టి) లేదు. నన్ను దూషించడం, అబద్ధాలు, వదంతులు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే ఆ పార్టీ వారికి తెలుసు’ అని మోదీ విమర్శించారు.