శబరిమలలోకి మహిళల ప్రవేశంపై కేరళ ఆంక్షలు

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై కేరళ ఆంక్షలు

50 ఏళ్లలోపు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర  ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 

భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని, వాటిని కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజకీయ కోణంలోనే ఎల్డీఎఫ్‌ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ప్రవేశం కల్పించాలని కొన్నేళ్లక్రితం ఆందోళనలు చెలరేగాయి. అయితే, ఈ నిర్ణయాన్ని శబరిమల ఆలయ యాజమాన్య బాధ్యతలు చూసే ట్రావెన్‌కోర్ దేవస్తాన బోర్డు వ్యతిరేకించింది. ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం ప్రకారం మహిళలకు రుతుస్రావం సైకిల్ ఉండే పదేళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసు మహిళల్ని ఆలయంలోకి అనుమతించబోమని తెలిపింది. 

ఈ నిర్ణయాన్ని 2018లో ప్రభుత్వం వ్యతిరేకించింది. అన్ని వయసుల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం అందరు మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చని తెలిపింది. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. పాత సంప్రదాయాల ప్రకారమే 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తామని శనివారం కోర్టుకు తెలిపింది.

పైగా, కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం, “ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉన్న మతపరమైన సంప్రదాయాలలో” ఎటువంటి మార్పులు చేసే ముందైనా, “ఆ మతానికి చెందిన ప్రముఖ మత పండితులు, పేరున్న సంఘ సంస్కర్తలతో విస్తృత సంప్రదింపులు జరపాలని, వారి అభిప్రాయాలను సేకరించాలని” సూచించింది.

ఈ అంశంపై వచ్చే నెల 7 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంతకాలం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై నమోదైన కేసుల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ నిరసనలకు సంబంధించి నమోదైన కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.