వాణిజ్య ఎల్పీజీ సీలిండర్ల పంపిణి తిరిగి ప్రారంభం

వాణిజ్య ఎల్పీజీ సీలిండర్ల పంపిణి తిరిగి ప్రారంభం
 
* హర్మూజ్‌ నుంచి రెండు రోజుల్లో ఎల్‌పీజీ సరఫరా చేసే 2 నౌకలు
వివిధ రాష్ట్రాల్లోని కొన్ని పరిశ్రమలకు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని తిరిగి ప్రారంభించామని, దేశంలోని రిటైల్ అవుట్‌లెట్లలో ఇప్పటివరకు ఎక్కడా  ఎల్పీజీ నిల్వలు అయిపోయినట్లు సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, వాణిజ్య వినియోగదారులకు కూడా  ఎల్పీజీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
 
వాణిజ్య సిలిండర్ల విషయంలో రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని, ప్రాధాన్య క్రమంలో సరఫరా చేస్తున్నామని ఆమె తెలిపారు. “కొన్ని రాష్ట్రాల్లో, వాణిజ్య సిలిండర్లను పరిశ్రమలకు వాటి కార్యాచరణ అవసరాలను తీర్చడానికి నేరుగా సరఫరా చేస్తున్నారు” అని ఆమె చెప్పారు. ఇది వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు, ముఖ్యంగా రెస్టారెంట్, హాస్పిటాలిటీ రంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.

“సిలిండర్ల బ్లాక్‌మార్కెట్‌ అరికట్టాలని రాష్ట్రాలను కోరాం. వాణిజ్య సిలిండర్ల విషయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఏపీ, బిహార్‌, కర్ణాటక, ఒడిశాలో వాణిజ్య సిలిండర్లు నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఎల్పీజీ సరఫరాలో గృహాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నాం” అని ఆమె తెలిపారు.

“పశ్చిమ గల్ఫ్‌లోని హర్మూజ్‌ వద్ద 24 నౌకలు ఉన్నాయి. ఎల్‌పీజీ సరఫరా చేసే 2 నౌకలు హర్మూజ్‌ నుంచి బయలుదేరాయి. శివాలిక్‌, నందాదేవి నౌకల్లో ఎల్‌పీజీ తరలింపు జరుగుతోంది. రెండు నౌకలు ఈనెల 16, 17 తేదీల్లో ముంద్రా, కాండ్లా పోర్టులకు వస్తున్నాయి” అని ఆమె వెల్లడించారు. ఆ తర్వాత శివాలిక్‌, నందాదేవి నౌకలు సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో దేశానికి వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు. మార్చి 16, 17 తేదీల్లో రావొచ్చని తెలిపారు. 

“పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో వారికి సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. హార్మూజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్‌లో 24 భారతీయ జెండాతో కూడిన నౌకలు ఉన్నాయి. మొత్తం 611 మంది నావికులు ఉన్నారు” అని ఆయన చెప్పారు.