బిన్నీ, ద్రవిడ్‌, మిథాలీలకు లైఫ్‌టైమ్‌ పురస్కారాలు

బిన్నీ, ద్రవిడ్‌, మిథాలీలకు లైఫ్‌టైమ్‌ పురస్కారాలు
* తెలుగమ్మాయి శ్రీచరణి బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ డెబ్యూ క్రికెటర్‌ అవార్డు
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా అందజేసే ‘నమన్‌’ అవార్డులను శనివారం ప్రకటించింది. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజ క్రికెటర్లు రోజర్‌ బిన్నీ, రాహుల్‌ ద్రవిడ్‌ (కల్నల్‌ సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌), మిథాలీ రాజ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించనుంది.  నిరుడు భారత మెన్స్‌ టెస్ట్‌, వన్డే జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు 2024-25 ఏడాదికి గాను బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌గా పాలి ఉమ్రిగర్‌ అవార్డు దక్కగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన ఎంపికైంది.

తెలుగమ్మాయి శ్రీచరణి బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ డెబ్యూ క్రికెటర్‌ అవార్డుకు ఎంపికవగా పురుషుల విభాగంలో ఈ అవార్డు హర్షిత్‌ రాణాను వరించింది. ఈ అవార్డులతో పాటు ఇటీవల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన (2025లో చాంపియన్స్‌ ట్రోఫీ, మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025, ఉమెన్స్‌ అండర్‌-19 టీ20 వరల్డ్‌ కప్‌, మెన్స్‌ అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌, మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌-2025) విజేతలను కూడా ఈ సందర్భంగా బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది.

రోజర్‌ బిన్నీ 1983 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, అతని కోచింగ్‌లో 2000లో అండర్‌-19 జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచింది. ఆ తర్వాత 2012-16 వరకు జాతీయ సెలెక్టర్‌గా, 2022 నుంచి 2025 వరకు బిసిసిఐ అధ్యక్షుని ఉన్నారు.

 
‘ది వాల్‌’గా గుర్తింపు పొందిన రాహుల్‌ ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 24,000 పరుగులు చేశాడు. బిసిసిఐ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సిఎ) హెడ్‌గా యువ క్రికెటర్లను తయారు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్లలో వేర్వేరు టీమ్‌లతో ఆడే సామర్థ్యం కలిగి ఉందంటే ఒకరకంగా ద్రవిడే కారణం. అలాగే, ద్రవిడ్‌ 2021-24 వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉండగా అతని హయాంలోనే భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్‌ కైవసం చేసుకుంది. 
 
ఇక, హైదరా బాద్‌కు చెందిన మిథాలీ రాజ్‌ భారత మహిళా క్రికెట్‌ కు గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించా రు. సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె దాదాపు 18ఏళ్ల పాటు భారత మహిళాజట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. వన్డేల్లో 7,805 పరుగులు చేసిన తొలి రికార్డు ఆమె పేరిటే ఉంది. ఆమె కెప్టెన్సీలో భారత జట్టు రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌ కప్‌ ఫైనల్స్‌కు చేరింది.