కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ కు అనుగుణంగా హైదరాబాద్ నుంచి సేవలు అందిస్తున్న మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ ట్రైన్స్‌గా మారుస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. రైలు నం. 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును రైలు నం. 17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది.
అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
రైలు నం. 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబా ద్ రైలును రైలు నం. 17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబా ద్ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది.
అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
రైలు నం. 07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును రైలు నం. 17065/17066 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్‌కు చేరుకుంటుంది.
అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
ఈ రైళ్లపట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం ప్రకటిస్తూ 2014 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా భారతీయ రైల్వే 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు.

More Stories
ఆర్టీసీలో సమ్మె సైరన్… నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు
230 మందికి మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు
తరుణ్ కటిక్ హత్యను ఖండిస్తూ క్యాండిల్ మార్చ్