సద్గురు రవిదాస్ కు 650వ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ నివాళులు 

సద్గురు రవిదాస్ కు 650వ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ నివాళులు 
సంత్ శిరోమణి సద్గురు శ్రీ రవిదాస్ 650వ జయంతి సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో వీరి విశిష్టత, జీవన విశేషాలను ప్రస్తావిస్తూ హర్యానాలోని సమాల్ఖాలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ ​అఖిల భారత ప్రతినిధి సభ  సమావేశాల సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ​ఘనంగా నివాళులు అర్పించారు. 

​ప్రస్తుత కాలంలో వివిధ విభజన శక్తులు ప్రజలను కుల, వర్గాల పేరుతో విడదీయాలని చూస్తున్నప్పుడు, పూజ్య సంత్ శ్రీ రవిదాస్జీవిత సందేశాన్ని అర్థం చేసుకుని, మనమందరం దేశం, సమాజం ఏకత కోసం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు

“​రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సంత్ శిరోమణి సద్గురు రవిదాస్  650వ జయంతి సందర్భంగా వారికి భక్తిపూర్వక నివాళులు అర్పిస్తోంది. మన గొప్ప సంత్ సంప్రదాయం భారతదేశానికి దేవుడు ఇచ్చిన విశిష్ట కానుక. మన సుదీర్ఘ చరిత్రలో, ఈ గొప్ప సంత్ సంప్రదాయం సమాజంలో దైవారాధన, భక్తి భావాన్ని మేల్కొల్పడమే కాకుండా, సామాజిక దురాచారాలను, వివక్షను నిర్మూలించి సామరస్య పూర్వక సమాజాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసింది” అని తెలిపారు.

అదే సమయంలో, విదేశీ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి సమాజాన్ని చైతన్యవంతం చేసిందని చెబుతూ ​ఈ గొప్ప సంత్ సంప్రదాయంలో సంత్ శ్రీ రవిదాస్ గారికి విశిష్ట స్థానం ఉందని చెప్పారు. ఆయన కర్మశీల జీవితం, కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొంటూ గృహస్థుగా ఉంటూనే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి, సాధు-సంతుల పట్ల భక్తిని, దీన జనుల పట్ల సేవా భావాన్ని కలిగి ఉండటం ఆయన సహజ స్వభావం అని  హోసబళే గుర్తు చేశారు.  ఆయన ఆధ్యాత్మికతతో నిండినవారని, సమాజంలో శ్రమకు గౌరవాన్ని, స్వచ్ఛమైన, పారదర్శకమైన ప్రవర్తన ప్రాముఖ్యతను ఆయన పునఃస్థాపించారని చెప్పారు.
 
 “సంత్ శ్రీ రవిదాస్ భక్తి మార్గంలో గొప్ప సంత్, ఆయన సమాజంలో కొత్త చైతన్యాన్ని నింపారు. పుట్టుక ఆధారంగా వచ్చే హెచ్చుతగ్గులను తిరస్కరించి, ప్రవర్తననే శ్రేష్ఠతకు కొలమానంగా భావించారు. మూఢనమ్మకాలు, దురాచారాల నుండి సమాజానికి విముక్తి కలిగించడంలోను, కాలం చెల్లిన సంప్రదాయాలను వదిలివేసి, సమకాలీన సామాజిక మార్పులను స్వీకరించేలా సమాజాన్ని సిద్ధం చేయడంలోను ఆయన చారిత్రక పాత్ర పోషించారు” అని తెలిపారు. ​
 
సంత్ శ్రీ రవిదాస్ ఆలోచనల ప్రాముఖ్యతను గుర్తించి, శ్రీ గురు గ్రంథ సాహిబ్‌లో ఆయన రాసిన 41 వాణీలను ‘శబ్ద’ రూపంలో చేర్చారని చెప్పారు.  సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, సంత్ శ్రీ రవిదాస్ దైవభక్తి, సేవా భావం, సమాజం పట్ల నిష్కల్మషమైన ప్రేమ కారణంగా కాశీలోని విద్వాంసులతో సహా సమాజంలోని అన్ని వర్గాల వారు ఆయన గొప్పతనాన్ని అంగీకరించారని తెలిపారు. 

“కాశీ రాజు, ఝాలీ రాణి, సుప్రసిద్ధ కృష్ణ భక్తురాలు మీరాబాయి వంటి రాజకుటుంబీకులు కూడా ఆయనను తమ గురువుగా స్వీకరించారు. గురు-శిష్య సంబంధంగా సంత్ శ్రీ రవిదాస్ – మీరాబాయిల బంధం ‘నిర్గుణ’, ‘సగుణ’ భక్తి ధారల సమ్మేళనం, అలాగే కుల వివక్షను నమ్మే వారికి ఇది ఒక గొప్ప పాఠం” అని హోసబళే వివరించారు .

​ముస్లిం దురాక్రమణదారుల అరాచకాలు సాగుతున్న ఆ కఠిన కాలంలో, భక్తి ధారను ప్రవహింపజేస్తూ సంత్ శ్రీ రవిదాస్ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పారు, ప్రజలను ధర్మపాలన చేయమని కోరారని తెలిపారు. సద్గురు సంత్ శ్రీ రవిదాస్ ను ముస్లిం మతంలోకి మార్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆయన భక్తి, ఆధ్యాత్మిక సాధనకు ప్రభావితులై, ఆయనను మతం మార్చాలనుకున్న వారే ఆయనకు అనుయాయులుగా మారిపోయారని గుర్తు చేశారు.