పార్లమెంటు ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల తీరును ఖండిస్తూ, బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు పార్లమెంట్ భవనం ప్రవేశద్వారం వద్ద ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ భవనం మెట్లపై కూర్చొని టీ తాగుతూ, పిక్నిక్ స్పాట్ లా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటిదని, అక్కడ ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, ప్రభుత్వ దృష్టికి ప్రజల సమస్యలను తీసుకువెళ్లే అత్యంత గౌరవనీయమైన వేదికగా దాన్ని చూడాలని తెలిపారు. అలాంటి స్థలాన్ని పిక్నిక్ స్పాట్‌లా మార్చి, జోకులు వేసుకుంటూ, కాలుమీద కాలు వేసుకుని వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని విమర్శించారు.
సభలో చర్చించే దమ్ము లేదని, బయట నిబంధనలు పాటించే ఓపిక లేదని పేర్కొంటూ రాహుల్ గాంధీకి పార్లమెంట్ అంటే పిక్నిక్ స్పాట్‌గా మారిందని ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించడమే అని మండిపడ్డారు. దేశంలో ఎల్‌పీజీ కొరత ఉందంటూ కాంగ్రెస్ ఒకవైపు అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
కేంద్ర మంత్రి పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని లెక్కలతో వివరణ ఇచ్చిన తర్వాత కూడా సమాధానం వినకుండా బయటకు వచ్చి, సస్పెండ్ అయిన ఎంపీలతో కలిసి పార్లమెంటు ఆవరణలో టీ తాగుతూ, బిస్కెట్లు తింటూ పార్లమెంటరీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమేనని అని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రతిపక్ష పార్టీలకూ అంతే బాధ్యత ఉండాలని, కానీ కాంగ్రెస్ ఆ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బాధ్యతాయుత నాయకత్వంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్ పేయిని ఐరాస సమావేశాలకు పంపిన సందర్భాన్ని గుర్తు చేశారు.
దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆ విలువలను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. భారత ప్రజలను అవమానించిన ఈ చర్యకు నిరసనగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసినట్లు తెలిపారు.

More Stories
ఆర్టీసీలో సమ్మె సైరన్… నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు
హైదరాబాద్ నుంచి రెగ్యులర్ రైళ్లుగా 3 సర్వీసులు
230 మందికి మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు