ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదు.. భయంతో ఎవరూ బుక్ చేయొద్దు

ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదు.. భయంతో ఎవరూ బుక్ చేయొద్దు

దేశంలో ఎల్‌పీజీ వంటగ్యాస్ కొరత లేదని, భయంతో ఎవరూ గ్యాస్ బుక్ చేయొద్దని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు భయాందోళనతో వెంటవెంటనే ఎల్‌పీజీ గ్యాస్ బుకింగ్స్ చేస్తున్నారని భారత చమురు శాఖ సంయుక్త కార్యదర్శి(మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) సుజాత శర్మ తెలిపారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రతిరోజు దాదాపు 55.7 లక్షల ఎల్‌పీజీ బుకింగ్సే జరిగేవని, ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 75.7 లక్షలు దాటిందని చెప్పారు. ఇంతగా ఆందోళన అక్కర్లేదని, దేశంలోని 25వేల ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లలో ఏ ఒక్కరి దగ్గరా గ్యాస్ స్టాక్ పూర్తిగా అయిపోలేదని సుజాత శర్మ స్పష్టం చేశారు.

“దేశంలోని అన్ని పెట్రోలు బంక్‌లకు పెట్రోలు, డీజిల్‌ల సప్లై నిలకడగానే జరుగుతోంది. అన్ని బంక్‌లలోనూ పెట్రోలు, డీజిల్ లభిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్‌ల తయారీలో భారత్ స్వయం సమృద్ధిని సాధించింది. ఏటా 258 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధిచేసే కెపాసిటీ భారతదేశ రిఫైనరీలకు ఉంది. ప్రస్తుతం దేశంలోని అన్ని రిఫైనరీలు 100 శాతం కెపాసిటీతో పనిచేస్తున్నాయి” అని ఆమె వెల్లడించారు. 

“మన దేశ రిఫైనరీల దగ్గర తగినన్ని ముడి చమురు నిల్వలు కూడా ఉన్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడదు. మార్చి 5 నుంచి డొమెస్టిక్ ఎల్‌పీజీ ఉత్పత్తిని 30 శాతం పెంచాం. ప్రజల ఇళ్లకు వంటగ్యాస్ సరఫరాలో అవాంతరం లేకుండా చూసేందుకే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది” అని సుజాత శర్మ పేర్కొన్నారు.

“అయితే ఇప్పటికీ ఎల్‌పీజీ పరిస్థితి అనేది భారత ప్రభుత్వానికి ఆందోళనకర అంశంగానే ఉంది. దేశంలోని గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) సరఫరా అంతరాయం లేకుండా జరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 1.5 కోట్ల పీఎన్‌జీ డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రధాన నగరాల్లోని సింహభాగం వాణిజ్య వినియోగదారులకు ఎల్‌పీజీ కనెక్షన్లే ఉన్నాయి” అని ఆమె చెప్పారు. 

“ప్రస్తుత పరిస్థితి కారణంగా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందుల తొలగింపునకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇలాంటి వాణిజ్య వినియోగదారులంతా ప్రత్యామ్నాయంగా పీఎన్‌జీ కనెక్షన్‌ను తీసుకోవచ్చు. ఇందుకోసం వారు ఆ నగరంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు లేదా డీలర్లను సంప్రదించాలి. తద్వారా ఎల్‌పీజీ సప్లైలపై కొంత ఒత్తిడి తగ్గుతుంది” అని సుజాత శర్మ సూచించారు.

“కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్లను ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాం. సరైన కస్టమర్లకు సకాలంలో సిలిండర్లు చేరేందుకు అనుగుణంగా ప్రాధాన్యతా మార్గదర్శకాలను రూపొందించాలని మేం రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు అదనంగా 48వేల కిలో లీటర్ల కిరోసిన్‌ను మంజూరు చేశాం” అని ఆమె తెలిపారు. 

“మూడు నెలలకోసారి ప్రజలకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు మంజూరు చేసే 1 లక్ష కిలో లీటర్ల కిరోసిన్ కోటాకు అదనంగా ఈ కేటాయింపు జరిగింది. ఇంధన నిల్వలపై ప్రచారమయ్యే వదంతులను నమ్మొద్దని మేం ప్రజలను కోరుతున్నాం. భయంతో గ్యాస్ బుకింగ్స్ చేయొద్దు” అని సుజాత శర్మ సూచించారు.