పశ్చిమాసియాలో నేపథ్యంలో ఉద్రిక్తతల ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ద్రవ్యోల్బణం మరోసారి పంజా విసిరింది. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరిలో 2.74 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం కేవలం నెల రోజుల్లోనే 3.21 శాతానికి ఎగబాకింది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు భవిష్యత్తులో ధరలకు మరింత ఆజ్యం పోయనున్నాయని నివేదికలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. జనవరిలో 2.13 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో ఏకంగా 3.47 శాతానికి చేరడం ఆందోళనకరం. కేవలం నెల రోజుల్లోనే 47 బేసిస్ పాయింట్ల మేర భారం పెరిగింది.
45.29 శాతం, కాలీఫ్లవర్ 43.77 శాతం చొప్పున ఎగిసిన కూరగాయల ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. వెండి ఆభరణాలపై ఏకంగా 160.84 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల ఒత్తిడి ఎక్కువగా ఉండటం ఆందోళనకర అంశం. ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.02 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో అది 3.37 శాతానికి చేరింది.
మౌలిక వసతులు, రవాణా ఖర్చులు పెరగడంతో గ్రామాల్లోని నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరింత ఎక్కువ ద్రవ్యోల్బణం చోటు చేసుకుంది. జాతీయ సగటు 3.21 శాతంకంటే తెలంగాణలో ఏకంగా 5.02 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అంటే దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఒకలా ఉంటే తెలంగాణలో అది రెట్టింపు స్థాయిలో ఉంది.
రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వాలు ధరలను అదుపు చేయడంలో విఫలమైతే, సామాన్యుడి పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం సెగతో అల్లాడుతున్న భారత్‌కు గ్యాస్ కొరత మరింత దడ పుట్టిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమయ్యిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక హెచ్చరించింది.
ఈ పరిణామం రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి ప్రధాన కారణం కానుందని హెచ్చరించింది. గ్యాస్ కొరతతో బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయడంతో సాధారణంగా రూ.1,750 ఉండే కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,000 దాటేసింది. కొందరు వ్యాపారులు రూ.3,000 చెల్లిస్తున్నారు. దీనివల్ల చిన్న హోటళ్లలో సాధారణ భోజనం ధరలు ఇప్పటికే 10 శాతం మేర పెరిగాయి. మరింత పెరగొచ్చని అంచనా.
మార్చి నెలలో గ్యాస్, చమురు ధరల అస్థిరత దీనిని మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే భారత్‌లో ధరల నియంత్రణ ఆర్‌బిఐకి అత్యంత సవాలుగా మారనుందని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, విద్యుత్ పొయ్యిలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక్క జైపూర్‌లోనే ప్రతి నెలా 2,500 నుంచి 3000 అమ్మే యూనిట్ల సంఖ్య 4,500కు పెరిగిందని ఒక వ్యాపారి తెలిపారు.
గత కొద్ది రోజుల్లో అమెజాన్‌లో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు 30 రెట్లు, ఫ్లిప్‌కార్ట్‌లో నాలుగు రెట్లు పెరిగినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ కెటెల్స్, రైస్ కుక్కర్లు, ఇతర గృహోపకరణాలకు కూడా తీవ్ర డిమాండ్ ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఇండక్షన్ కుక్‌టాప్‌లకు మూడు రెట్ల డిమాండ్ పెరిగిందని ఎలక్ట్రానిక్ రిటైలర్ సంస్థ క్రోమా తెలిపింది. అలాగే తమ విద్యుత్తు గృహోపకరణాల అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగినట్టు స్టవ్‌క్రాఫ్ట్ అనే విద్యుత్తు ఉపకరణాల తయారీ సంస్థ వెల్లడించింది. ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్లు, ఇతర పరికరాల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగిపోయాయి.

More Stories
యుద్ధంపై రోజుకో మాట మారుస్తున్న ట్రంప్.. పర్యవసానం అస్పష్టం
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కోమాలో ఉన్నారా? కాలు కోల్పోయారా?
ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు.. భయంతో ఎవరూ బుక్ చేయొద్దు