భారత్, చైనా, బంగ్లాదేశ్ లతోసహా 16 కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ యంత్రాంగం వాణిజ్య చట్టం 1974లోని ‘సెక్షన్ 301’ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. టారిఫ్‌లు చట్టవిరుద్ధమని గతనెల సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆయా దేశాలపై టారిఫ్‌ల ఒత్తిడిని పునరద్ధరించేందుకు చట్టవిరుద్ధమైన వాణిజ్య విధానాల దర్యాప్తులను ప్రారంభించింది.
సెక్షన్ 301 వాణిజ్యభాగస్వామ్యులపై సుంకాలు లేదా ఇతర ప్రతీకార చర్యలను చేపట్టే అధికారం యుఎస్ వాణిజ్య ప్రతినిధికి ఇస్తుంది. ఇతర దేశాలు అనుసరిస్తున్న చట్టవిరుద్ధమైన వాణిజ్య విధానాలను సవాలు చేయడమే ఈ సెక్షన్ 301 లక్ష్యం. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలు అమెరికా వ్యాపారాలు, ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా లేదా అనేదానిపై ఈ సెక్షన్ కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలు కలిగిస్తుంది.
అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ అనంతరం తమకు నష్టం కలిగిస్తున్నాయంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆయా దేశాలపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. రానున్న ఏప్రిల్, మే నెలల్లో యూరోపియన్ యూనియన్, భారతదేశం, జపాన్,దక్షిణ కొరియా మరియు మెక్సికోలపై కొత్త సుంకాలను విధించే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ పేర్కొన్నారు.
అదనపు సామర్థ్య దర్యాప్తుకు లోబడి ఉన్న ఇతర వాణిజ్య భాగస్వామ్యులలో తైవాన్, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, సింగపూర్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్, నార్వేలు ఉన్నాయి. అయితే ఈ వాణిజ్య దర్యాప్తు కింద అమెరికా రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం కెనడా పేరును సూచించలేదు. ఈ దర్యాప్తులు తయారీ రంగాల్లో నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం, ఉత్పత్తి ఆధారాలు ఉన్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టిసారిస్తాయని గ్రీర్ కాన్ఫరెన్స్ కాల్‌లో మీడియాకు వెల్లడించారు.
బలవంతపు శ్రమతో ఉత్పత్తి చేయబడిన వస్తువుల దిగుమతులను నిషేధించడానికి సెక్షన్ 301 కింద మరో దర్యాప్తును ప్రారంభించనున్నట్లు గ్రీర్ తెలిపారు. ఈ దర్యాప్తు 60కంటే ఎక్కువ దేశాలకు వర్తిస్తుందని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడన్ సంతకం చేసిన ఉయ్ఘర్ ఫోర్స్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చైనా నుండి సోలార్ ప్యానెల్ దిగుమతులు, ఇతర వస్తువులపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ సెక్షన్ కింద ఈ చర్యలను ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉంది.

More Stories
2 రోజుల్లో గ్యాస్ రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!
తొలి 6 రోజుల్లో అమెరికా యుద్ధం ఖర్చు 11.3 బిలియన్ల డాలర్లు
ఢిల్లీలో పెట్రోల్ సరఫరాపై అమిత్ షా చైర్మన్ గా మంత్రుల కమిటీ