ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు ప్రారంభం

ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు ప్రారంభం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ  మూడు రోజుల సమావేశాలు హర్యానాలోని సమల్ఖా కేంద్రంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి.  సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భరత మాత చిత్ర పటానికి పుష్పార్చనచేయడం ద్వారా సమావేశాలను  లాంఛనంగా ప్రారంభించారు.
 
ప్రస్తుతం సంఘ కార్య శతాబ్ది కావడంతో ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. దేశవ్యాప్తంగా సంస్థాగత విస్తరణ, సామాజిక సంబంధాలు, సంఘ కార్యకలాపాల్లో నిమగ్నమైన 1,400 మంది సంఘ కార్యకర్తలు హాజరయ్యారు.  దేశంలోని ప్రతి రాష్టం నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత గత యాదాద్రి కాలంగా దేశంలో మరణించిన ప్రతిష్ఠిత వ్యక్తులకు శ్రద్ధాంజలి ఘటించారు.
 
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ సీ.ఆర్. ముకుంద, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మీడియా సమావేశంలో మొదటి రోజు సమావేశ వివరాలను  వివరించారు. సంఘ కార్య శతాబ్దిలో సంఘ్ సంస్థాగతంగా చాలా విస్తరించిందని, గత రెండు మూడు సంవత్సరాలుగా స్వయంసేవకులు దేశమంతా అంకిత భావంతో పనిచేశారని తెలిపారు. 
 
4,000 కంటే ఎక్కువ ప్రదేశాలలో సంఘ కార్యం ప్రారంభమైందని, 5,000 కంటే ఎక్కువ కొత్త శాఖలు కూడా ప్రారంభమయ్యాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరిన్ని గ్రామాలలో ఈ శాఖ విస్తరణ కొనసాగుతుందని ప్రకటించారు. అక్టోబర్ 2 న నాగపూర్ లో సంఘ కార్య శతాబ్ది సంవత్సరం అధికారికంగా ప్రారంభం కాగా, ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సంఘ కార్య శతాబ్దికి సంబంధించిన స్మారక స్టాంపును విడుదల చేశారు.  సంఘ కార్య శతాబ్ది సందర్భంగా సంఘ శాఖలను విస్తరించడం, దృఢీకరణపై దృష్టి పెట్టారు. పంచపరివర్తన్ (పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, సామాజిక సమరసత, పౌర విధులు)ను కూడా ప్రతిపాదించి, ప్రచారం చేశారు. 
 
సమాజంలో వున్న ప్రతిష్ఠిత వ్యక్తులతో సమ్మేళనాలు కూడా జరుపుతున్నారు. వీటి ద్వారా సమాజంలో నిర్మాణాత్మక ఆలోచనలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  పౌర సమావేశాలు, మేధోపరమైన చర్చలు కూడా జరపడం ద్వారా కూడా ఎక్కువ మంది సంఘ్ వైపు ఆకర్షితులు అవుతున్నారు బస్తీలు, బ్లాక్ స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయని, అలాగే సామాజిక సమరసతను సాధించడానికి ప్రముఖులతో చర్చలు కూడా జరుపుతున్నారు.

 
ఇక సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ‘‘హిందూ సమ్మేళనాలు’’ కూడా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గృహ సంపర్క కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామాన్ని చేరుకోవడమే ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కుటుంబాలను చేరుకున్నారు.
 
వనవాసి ప్రాంతాలలోనూ, గిరిజన సముదాయాల మధ్య కూడా ఇంటింటికీ, గ్రామం గ్రామానికీ విస్తరించేలా సంపర్క కార్యక్రమాలు సమర్థవంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 36,000 ‘హిందూ సమ్మేళన’ సమావేశాలు జరిగాయి. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, గిరిజన సముదాయాలు, మారుమూల ప్రాంతాలలో మరిన్ని సమావేశాలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు.
 
గురు తేగ్ బహదూర్ జీ జీవిత విశేషాలతో  ప్రదర్శన
పట్టికల్యాణలో ఉన్న ‘మాధవ్ సృష్టి కేంద్రం’ వద్ద ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో, తొమ్మిదవ సిక్కు గురువు, గొప్ప అమరుడు అయిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీ జీవిత విశేషాలతో పాటు—హర్యానాలోని చారిత్రక, పౌరాణిక ప్రదేశాలు, అలాగే సమాజానికి విశేష సేవలందించిన వివిధ మహనీయుల జీవితాలు, ఆలోచనలు, వారి కృషిని ప్రదర్శించారు. మార్చి 12న సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఆయన భారత్ మాత, సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, నమస్కరించారు.