230 మందికి మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు

230 మందికి మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు

ఇటీవల మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి (వికల్ప్‌) అంత్యక్రియలు, సంస్మరణ సభకు హాజరైన మాజీ మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దృష్టి సారించింది. ఈ క్రమంలో సుమారు 230 మందికి నోటీసులు జారీ చేయడం ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

గతేడాది అక్టోబరు 18 న హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కోహెడలో మావోయిస్టు అగ్రనేతలు రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డిల జ్ఞాపకార్థం ‘నారాయణపూర్‌ అమరుల సంస్మరణ సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. 

సభలో పాల్గొన్న వారిపై ఎన్‌ఐఎ ఆకస్మికంగా నోటీసులు జారీ చేసింది. ఈ సభలో పాల్గొన్న కొందరు నాయకులు ప్రభుత్వ వ్యతిరేక, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గాదె ఇన్నయ్యలాంటి వారిపై ఇప్పటికే దేశద్రోహం కేసులు నమోదయ్యాయి.  నిషేధిత సంస్థలతో సంబంధాలు లేదా ఆ సంస్థల భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారా? అనే కోణంలో లోతైన విచారణ చేపట్టడానికి ఈ నోటీసులు ఇచ్చారు.

జస్టిస్‌ చంద్రకుమార్‌, సోనీ సోరి, పినాకపాణి వంటి ప్రముఖులు ఈ సభలో పాల్గొనడం కూడా దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకర్షించింది.  నోటీసులు అందుకున్నవారిలో మెజారిటీ వ్యక్తులు హుజూరాబాద్‌, సైదాపూర్‌, భీమదేవరపల్లి, ముల్కనూరు, కమలాపూర్‌, ధర్మసాగర్‌, పరకాల, టేకుమట్ల, వేలేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. దశాబ్దాల క్రితమే జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తమకు, ఇప్పుడు పాత సంబంధాల పేరుతో నోటీసులు రావడంపై మాజీ మావోయిస్టులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.