పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ ఫోన్లో మాట్లాడుతూ ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు. పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడిన అంశాలను ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల మరణాలు, మౌలిక సదుపాయాల విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
“ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపన కోసం భారత్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతలు తగ్గించి చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరాను” అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ గత పది రోజుల్లో ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్, ఖతార్ దేశాధినేతలతో మాట్లాడారు.
పశ్చిమాసియాలో భారతీయ పౌరుల భద్రత, క్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు. సరకు రవాణా, ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల ద్వారా రవాణా నిరంతరాయంగా సాగాలని కోరారు. హింసకు స్వస్తి పలికి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని హితవు పలికారు.
పశ్చిమాసియా దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఇరాన్‌లో 9 వేల మంది, ఇజ్రాయెల్‌లో 40 వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రత కోసం కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఎంబసీ సహాయంతో స్వదేశానికి చేరుకున్నారు. మిగతా వారిని సైతం సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అంతకుముందు డిల్లీలోని ఎన్ ఎక్స్ టి సమ్మిట్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశంలో ఎల్పీజీ కొరత ఉందంటూ కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కొన్ని వస్తువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని, అలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభం ఏ దేశాన్నీ వదల్లేదని, అయితే భారత ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మనమంతా కలిసికట్టుగా దేశాన్ని కరోనా సంక్షోభం నుంచి ఎలాగైతే బయటపడేశామో, అలాగే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని కూడా అధిగమిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
“2014కి ముందు, భారతదేశంలో దాదాపు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు లేవు. సంక్షోభ సమయాల్లో ముడి చమురును నిల్వ చేసే సామర్థ్యం అప్పుడు లేదు. నేడు, దేశానికి 50 లక్షల టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ ఉంది. సామర్థ్యాన్ని పెంచే పని జరుగుతోంది” అని ప్రధాని తెలిపారు.
“గత దశాబ్దంలో, మేం శుద్ధి సామర్థ్యాన్ని ఏటా 40 మిలియన్ టన్నులకు పైగా పెంచాం. అందుకే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కేంద్రాలలో ఒకటిగా మారింది. భారత్‌ను స్వావలంబన చేయడానికి మేం చేస్తున్న పని స్థాయి, విస్తృతిని మీరు ఊహించవచ్చు. యుద్ధం వల్ల ఏర్పడిన ఈ సంక్షోభాన్ని మేం కచ్చితంగా అధిగమిస్తాం.” అని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు.

More Stories
వీధుల్లో బౌలింగ్ చేసే బుమ్రా నేడు భయంకరమైన ఫాస్ట్ బౌలర్
కేరళలో సీనియర్ సిపిఎం నేత సుధాకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ!
2 రోజుల్లో గ్యాస్ రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!