తరుణ్ కటిక్ హత్యను ఖండిస్తూ క్యాండిల్ మార్చ్

తరుణ్ కటిక్ హత్యను ఖండిస్తూ క్యాండిల్ మార్చ్
 
హోళీ సందర్భంగా ఢిల్లీలో జరిగిన దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు  తరుణ్ కటిక్ కు నివాళిగా హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పాల్గొన్నారు. ఆర్య కటిక సంఘం, వివిధ దళిత సంఘాలు, విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాలు కలిసి ఈ క్యాండిల్ మార్చ్ నిర్వహించాయి. 
ఈ సందర్భంగా పాల్గొన్న వారిని అభినందించిన రాంచందర్ రావు తరుణ్ కటిక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, హోళీ రోజున ఒక బాలిక పొరపాటున విసిరిన నీటి బెలూన్ రోడ్డుపై వెళ్తున్న బుర్ఖా ధరించిన మహిళపై పడిన ఘటనను కారణంగా చూపుతూ, జిహాదీ సిద్ధాంతాలకు ప్రేరితమైన కొంతమంది దుండగులు తరుణ్ కటిక్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
ఇటువంటి ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయని పేర్కొంటూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరూ స్పందించి ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.  కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన ఆయన, హిందూ దళిత యువకుడిపై దాడి జరిగి హత్య జరిగినప్పటికీ కొంతమంది  కుహనా లౌకికవాదులు మౌనం పాటించడం బాధాకరమని చెప్పారు. 
సమాజంలో ఎవరిపై దాడి జరిగినా సమానంగా స్పందించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని స్పష్టం చేశారు. తరుణ్ కటిక్ హత్యకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మానవతా దృక్పథంతో ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలని పిలుపునిచ్చారు.