గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోపు (60 గంటలు) వినియోగదారుడి ఇంటికి సిలిండర్ డెలివరీ కావాలి. ఒకవేళ నిర్ణీత సమయంలోగా గ్యాస్ అందకపోతే, వినియోగదారులు నేరుగా సంబంధిత కంపెనీలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మీరు వాడుతున్న గ్యాస్ కనెక్షన్‌ను బట్టి ఈ క్రింది టోల్ ఫ్రీ లేదా వాట్సాప్ నెంబర్లను సంప్రదించవచ్చు:
| ఇండేన్ గ్యాస్ (Indane) | 1800-2333-555 | 7718955555 |
| భారత్ గ్యాస్ (Bharat Gas) | 1800-22-4344 | 7715012345 |
| హెచ్‌పీ గ్యాస్ (HP Gas) | 1800-2333-555 | 9493602222 |
ఫిర్యాదు ఎలా చేయాలి?
- పైన పేర్కొన్న నెంబర్లకు కాల్ చేసి మీ కన్జ్యూమర్ నెంబర్, బుకింగ్ వివరాలను తెలియజేయాలి.
- ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా మీ ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేయవచ్చు.
- డెలివరీ బాయ్ అదనపు డబ్బులు అడిగినా లేదా సిలిండర్ సరైన సమయంలో ఇవ్వకపోయినా ఈ నెంబర్లు ఉపయోగపడతాయి.
నిబంధనల ప్రకారం సేవలు పొందని పక్షంలో మౌనంగా ఉండకుండా, ఫిర్యాదు చేయడం ద్వారా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు సూచిస్తున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ లభ్యతపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర మంత్రి లోక్‌సభలో మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. సిలిండర్ల సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సిలిండర్ బుకింగ్‌కు నగరాల్లో 25 రోజుల వ్యవధి, గ్రామాల్లో 45 రోజుల వ్యవధి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎల్ఎన్‌జీ కార్గోలు దాదాపు ప్రతిరోజూ ప్రత్యామ్నాయ సరఫరా రూట్లలో భారత్ కు వస్తున్నాయని తెలిపారు. ఒకవేళ ఘర్షణలు సుదీర్ఘకాలం కొనసాగినప్పటికీ తగినంత గ్యాస్ ఉత్పత్తి, సరఫరా ఏర్పాట్లు చేయగలిగే స్థితిలో భారత్ ఉందని పేర్కొన్నారు. గృహాలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. రిఫైనరీలకు తగిన ఆదేశాలు ఇవ్వడం ద్వారా గత ఐదు రోజులుగా 28 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెరిగినట్టు హర్దీప్ సింగ్ పురి తెలిపారు.
వంట గ్యాస్ కొరతకు సంబంధించి బ్లాక్ మార్కెట్‌ను రాష్ట్రాలే నిరోధించాలని స్పష్టం చేస్తూ వినియోగదారుల ఆందోళన కారణంగానే పంపిణీదారులు, రిటైల్ స్థాయిలో నిల్వ, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, సరఫరా కొరత లేదని ఆయన తెలిపారు. భారతదేశం గతంలో గల్ఫ్ దేశాల నుండి 60 శాతం ఎల్‌పిజిని దిగుమతి చేసుకునేదని, 40 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతుందని వివరించారు.
గల్ఫ్ వనరులతో పాటు అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా నుండి కూడా ఎల్‌పిజిని వేగవంతంగా సేకరిస్తున్నామని తెలిపారు. దేశీయ సరఫరా సజావుగా ఉందని, డెలివరీ పక్రీయ మారలేదని, బుకింగ్ నుండి డెలివరీకి సమయం 2.5 రోజులు అని పేర్కొన్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ప్రాతిపదికన సరఫరా జరుగుతోందని మంత్రి తెలిపారు. సరఫరా పరిమితి వాతావరణంలో బ్లాక్ మార్కెట్ పనిచేస్తోందని, ఇది నిల్వ, దారి మళ్లింపు, అధిక ధరలకు తిరిగి అమ్మకానికి దారితీసిందని అంగీకరించారు.

More Stories
వీధుల్లో బౌలింగ్ చేసే బుమ్రా నేడు భయంకరమైన ఫాస్ట్ బౌలర్
కేరళలో సీనియర్ సిపిఎం నేత సుధాకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ!
యుద్ధం ముగింపుకు ఇరాన్ మూడు షరతులు