కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు

కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు
 
కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం విషయాలను వక్రీకరించి రాజకీయ లాభాల కోసం ప్రచారం చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో కేంద్రంపై ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
కేంద్రం తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులు అందిస్తున్నప్పటికీ వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.  ఈ సందర్భంగా  మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా  ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం చదివి మాట్లాడాలని డా. కాసం వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంపై ఆ చట్టంలో ఏర్పాటు” అని ఎక్కడా లేకుండా “అవకాశాల పరిశీలనా” అని మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ విధంగా చట్టంలో నమోదు చేసిందని గుర్తు చేశారు.  ఆ చట్టం రూపకల్పనలో కాంగ్రెస్ నాయకులే కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి కేంద్రాన్ని విమర్శించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కూడా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ  భూమి కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలే సంవత్సరాల పాటు ఆలస్యం చేశాయని విమర్శించారు. అయినప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కంటే మెరుగైన రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నదని కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 

 
అదేవిధంగా ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంపైనా కాంగ్రెస్ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు అమలు సాధ్యం కాదని నిర్ణయం తీసుకున్నది కూడా అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధికి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు అందించిందని డా. వెంకటేశ్వర్లు తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడమేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసినా అనర్హత వర్తించదని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని విమర్శించారు. 
 
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం, కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతు ప్రకటించడం వంటి విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినవేనని చెప్పారు.  గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని కాసం వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ఇప్పుడు అదే విషయంపై నైతిక బోధలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి ఉదాహరణ అని ఆయన విమర్శించారు.