నేనెప్పుడూ ఆ నియమాలు ఉల్లంఘించలేదు

నేనెప్పుడూ ఆ నియమాలు ఉల్లంఘించలేదు

* లోక్​సభ రూల్స్ ప్రకారమే నడుస్తుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే లోక్‌సభ అని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నిన్నటి సభలో వీగిపోయిన నేపథ్యంలో, గురువారం ఓం బిర్లా లోక్‌సభకు హాజరయ్యారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై 12 గంటల పాటు చర్చ జరిగిందని, ఈ క్రమంలో తన ప్రవర్తనపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసిన అంశాన్ని స్పీకర్‌ ప్రస్తావించారు. 

తాను ఎల్లప్పడూ సభ నిర్దేశించిన నియమ నిబంధనలు, విధానాలకు లోబడే విధులు నిర్వర్తించినట్టు తెలిపారు. ఇకపై కూడా తన విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తానని పునరుద్ఘాటించారు. మంత్రి అయినా, ప్రతిపక్ష ఎంపీ అయినా, సభలోని ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం మాట్లాడే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

“సభలోని సభ్యులు సభా సంప్రదాయాలను బలోపేతం చేశారు. సభ గౌరవాన్ని పెంచారు. నాపై నమ్మకం ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. నా విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా నిర్వహిస్తానని మీకు హామీ ఇస్తున్నాను” అని తెలిపారు. 

కొంత మంది సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణలపై ఓం బిర్లా స్పందిస్తూ “ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కొందరు సభ్యులు ఆరోపించారు. వాస్తవానికి మంత్రి అయినా లేదా ప్రతిపక్ష ఎంపీ అయినా, ఏ సభ్యుడైనా సరే, నిబంధనల ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని నేను స్పష్టం చేయాలని అనుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

సభా కార్యక్రమాలు సజావుగా జరగడానికి నిబంధనలు పాటించడం చాలా అవసరం అని ఓం బిర్లా చెప్పారు. “సభ నిబంధనల ప్రకారమే నడుస్తుంది. ఈ నిబంధనలను ప్రభుత్వమో లేదా ప్రతిపక్షమే రూపొందించలేదు. నిబంధనలు అనేవి సభ్యులందరికీ సమానంగా వర్తిస్తాయి” అని ఆయన స్పష్టం చేశారు. “ఏ అంశం మీదనైనా మాట్లాడాలని అనుకుంటే, ప్రధాన మంత్రైనా, మరెవరైనా ముందుగా నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాతే వారికి అనుమతి లభిస్తుంది. కనుక ఈ సభలోని ఏ సభ్యునికి కూడా నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా మాట్లాడే హక్కు ఉండదు” అని స్పీకర్ ఓం బిర్లా తేల్చిచెప్పారు.

కొంత మంది ప్రతిపక్ష సభ్యులు మాట్లాడాలని అనుకున్నప్పుడు, వారి మైక్​లను కట్ చేస్తున్నారనే ఆరోపణలపై ఓం బిర్లా తనదైన శైలిలో స్పందించారు. సభలోని ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంటుందని, అయితే వారు నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని చురకలు అంటించారు.  “మైక్​ను ఆన్​ చేయడానికి, లేదా ఆఫ్ చేయడానికి నా దగ్గర ఎటువంటి స్విచ్​ ఉండదు. సభాధ్యక్షులు ఒక సభ్యునికి మాట్లాడడానికి అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మైక్ ఆన్ అవుతుంది” అని స్పష్టం చేశారు.

కాగా, ఓం బిర్లా గురువారం లోక్​సభకు వచ్చిన సమయంలో, విపక్షాలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన వ్యక్తం చేశాయి. దీనితో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో సభ సజావుగా సాగేలా సహకరించాలని ఇండియా కూటమి ఎంపీలను కోరారు.

“ప్రశ్నోత్తరాల సమయం అనేది పార్లమెంటరీ కార్యకలాపాల్లో అత్యంత కీలకమైనది. దీనిని కొనసాగినివ్వాలని నేను కోరుతున్నాను. ఎంపీలు తమ సమస్యలను ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తి ప్రభుత్వం దానికి జవాబుదారీగా ఉండేలా చేయవచ్చు. గత రెండు రోజులుగా జరిగిన చర్చపై మధ్యాహ్నం నా అభిప్రాయాలను చెబుతాను” అని తెలిపారు. అయినప్పటికీ విపక్షాలు శాంతించకపోవడం గమనార్హం. దీనితో తన ప్రసంగం ముగిసిన వెంటనే బిర్లా సభను వాయిదా వేశారు.