టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సవాల నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు చట్టపరమైన సమస్యలను చిక్కుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన వేళ మైదానంలో హార్దిక్ చేసిన కొన్ని పనులు ఈ వివాదానికి దారితీశాయి.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా తన భుజాలపై జాతీయ జెండాను చుట్టుకుని మైదానమంతా పరుగెత్తుతూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి పోడియంపై పడుకుని వేడుకలు చేసుకున్న సమయంలో కూడా జాతీయ జెండాను శరీరంపైనే ఉంచుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ విషయంపై పుణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుణేలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన సమర్పించిన ఫిర్యాదులో 1971 జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం కింద హార్దిక్ ప్రవర్తన జాతీయ పతాకాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. జెండాను ఒంటికి చుట్టుకుని పడుకోవడం, ఆ స్థితిలో అసభ్యంగా ప్రవర్తించడం మువ్వన్నెల జెండా గౌరవాన్ని తగ్గించేలా ఉందని వాజిద్ తన పిటిషన్‌లో ఆరోపించారు.
భారత జట్టు విజయం సాధించిన తర్వాత పాండ్యా జాతీయ జెండాను తన శరీరం చుట్టూ చుట్టుకుని మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.
మ్యాచ్ అనంతరం పాండ్యా, అతని భాగస్వామి మహికా శర్మ సంబరాలు చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఇద్దరూ డ్యాన్స్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాతే ఫిర్యాదు నమోదు చేయాలని న్యాయవాది ముందుకు వచ్చారు.
సోషల్ మీడియాలో సైతం ఈ ఘటనపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు పాండ్యాకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు జాతీయ చిహ్నాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక టోర్నమెంట్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం పోటీల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అంతకుముందు జరిగిన 2024 ఐసిసి టి20 ప్రప్రంచ కప్ లో కూడా పాండ్యా 11 వికెట్లు తీసి 144 పరుగులు చేసి జట్టుకు కీలకంగా నిలిచాడు.

More Stories
నేనెప్పుడూ ఆ నియమాలు ఉల్లంఘించలేదు
ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం!
స్పీకర్ ఓం బిర్లాపై వీగిన అవిశ్వాస తీర్మానం