దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావం అయోధ్య ఆలయాన్ని తాకింది. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా అమావా ఆలయంలోని రామ్ రసోయీ (అన్నదాన కేంద్రం)ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు అన్నదాన కేంద్రం వద్ద నోటీసులు అంటించారు.
శిర్డీలోని సాయిబాబా ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రసాదం సిద్ధం చేయడంపై ఆందోళన చెందుతున్నారు. శిర్డీ సాయిబాబా గుడిలోని ప్రసాదాలయంలో రోజూ 40,000 వేల మంది భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ప్రస్తుతం శిర్డీ సాయిబాబా సంస్థాన్‌లో 14రోజులపాటు ప్రసాదం తయారుచేయడానికి సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి.
అయితే ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం శిర్డీ ఆలయంలో ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ప్రసాదం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈనెల చివర్లో శ్రీరామనవమి పండగ జరగనుంది. అప్పుడు గుడిలో లడ్డూలు, బూందీల తయారీని ఆపేయాల్సి వస్తుందని శిర్డీ సాయిబాబా సంస్థాన్ అధికారులు భయపడుతున్నారు.
అలాగే కర్ణాటకలోని పలు దేవాలయాలపై ఎల్పీజీ కొరత ప్రభావం పడడంతో ప్రసాదం తయారీకి కలపను నిల్వ చేస్తున్నాయి. అయితే, కర్ణాటక హిందూ దేవాలయాల్లో తక్షణ గ్యాస్ సంక్షోభం లేడనై అఖిల కర్ణాటక హిందూ ఆలయ అర్చకుల సమాఖ్య అధ్యక్షుడు ఎంఎస్ వెంకటాచల్లయ్య తెలిపారు. “మా వద్ద ఒక వారానికి సరిపడా ఎల్పీజీ సిలిండర్ స్టాక్ ఉంది. అయితే గ్యాస్ కొరత తర్వాత కొనసాగితే భక్తులకు ప్రసాదం అందించడంలో సమస్యలు ఎదురవుతాయి. ఎల్పీజీ సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్రంలోని అనేక దేవాలయాలు కలపను నిల్వ చేయడం ప్రారంభించాయి” అని చెప్పారు.
మరోవైపు వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఎల్పీజీ కొరత వల్ల ఢిల్లీ హైకోర్టులోని క్యాంటీన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న సంక్షోభం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడుతుండడంతో పలు ప్రాంతాల్లోని తమ హోటళ్లలో గురువారం నుంచి లంచ్, డిన్నర్ అందుబాటులో ఉండదని ప్రముఖ హోటల్ ఐటీసీ వెల్లడించింది. తాత్కాలికంగా ఈ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో భారతీయులు ఇండక్షన్ స్టవ్‌లను తెగ కొంటేస్తుండడంతో ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో వివిధ రకాల ఇండక్షన్ స్టవ్‌లు స్టాక్ లేకుండా పోతున్నాయి.

More Stories
భారత్‌కు చమురు సరఫరాకు ఢోకా లేదు
అమెరికాలో రిలయన్స్ 300 బిలియన్ డాలర్లతో ఆయిల్ రిఫైనరీ
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బెర్స్ రాజీనామా