అమెరికాలో రిలయన్స్ 300 బిలియన్ డాలర్లతో ఆయిల్ రిఫైనరీ

అమెరికాలో రిలయన్స్ 300 బిలియన్ డాలర్లతో ఆయిల్ రిఫైనరీ

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అమెరికాలో 50 ఏళ్ల తర్వాత కొత్తగా చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అందుకోసం 300 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ కొత్త కర్మాగారం అమెరికన్ మార్కెట్లకు ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని చెప్పారు.

‘అమెరికా నిజమైన ఇంధన ఆధిపత్యానికి తిరిగి వస్తుంది. అమెరికా టెక్సాస్​లోని బ్రౌన్స్​విల్లేలో శుద్ది కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి గర్వపడుతున్నాను. 50 ఏళ్లలో అమెరికాలో ప్రారంభమవుతున్న తొలి కొత్త ఆయిల్ రిఫైనరీ ఇది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద 300 బిలియన్ డాలర్ల ఒప్పందం’ అని ట్రంప్ తెలిపారు. 

అమెరికన్ కార్మికులు, ఇంధన రంగం, అలాగే దక్షిణ టెక్సాస్ ప్రజలకు ఇది పెద్ద విజయం అని పేర్కొంటూ కొత్త రిఫైనరీ వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ లాభాలు కలుగుతాయని ట్రంప్ చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా బిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రభావం ఉంటుందని తెలిపారు. 

బ్రౌన్స్‌విల్లే పోర్టులో నిర్మించే ఈ కొత్త చమురు శుద్ధి కార్మాగారం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా ఉండబోతుందని ట్రంప్ చెప్పారు. ఇది అమెరికా మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా దేశ జాతీయ భద్రతను బలపరచడంతో పాటు ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని తెలిపారు. అలాగే ప్రపంచ ఎగుమతులకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

మరోవైపు భారత్​లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎల్​పీజీ ఉత్పత్తిన పెంచేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనింగ్ కేంద్రంగా పేరుగాంచిన జామ్ నగర్​లోని ఉన్న రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్​ల నుంచి ఎల్​పీజీ ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపింది.