కేంద్ర మాజీ మంత్రి కావూరు కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కావూరు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(82) కన్నుమూశారు. హైదరాబాద్​లోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1943లో ఏలూరులో జన్మించిన ఆయన వరంగల్ ఆర్​ఈసీ(రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ) నుంచి ఇంజినీరింగ్ పట్టాను పుచ్చుకున్నారు.  2014లో రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. అనంతరం 2014లో బీజేపీలో చేరారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు.
మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. కావూరు మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కావూరు సాంబశివరావు మృతి అత్యంత బాధకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. రాజకీయ, వ్యాపార రంగంలో ఆయనది ప్రత్యేక ముద్ర అని కొనియాడారు. విషాద సమయంలో కావురు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

కావూరు సాంబశివరావు కన్నుమూశారని తెలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  విచారం వ్యక్తంచేశారు.  ఐదుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా వారు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని ఆయన సేవలను కొనియాడారు. వారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో ప్రజాసమస్యలపై పార్లమెంటులో తన గళాన్ని వినిపించారన్నారు. కావూరి సాంబశివరావు మరణం పట్ల కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి కావూరి అని కొనియాడారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై నిరంతరం గళం వినిపించిన గొప్ప నాయకుడు కావూరి అని ప్రశంసించారు.

కావూరు సాంబశివరావు మృతిపట్ల బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంతాపం తెలిపారు. 2013లో ఆయనను సిరిసిల్లకు ఆహ్వానించానని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. కావూరు సిరిసిల్ల పవర్​ లూమ్​ పరిశ్రమకు మద్ధతుగా నిలిచారని కేటీఆర్​ కొనియాడారు.