గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపై దాడి చేస్తాం.. ఇరాన్ 

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపై దాడి చేస్తాం.. ఇరాన్ 

* 300 క్షిప‌ణులు ప్రయోగించిన ఇరాన్‌.. 16 నౌక‌ల‌ను పేల్చేసిన అమెరికా

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12వ రోజుకు చేరుకుంది. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ సెంట్రల్ ఆపరేషనల్ కమాండ్ ఖాటమ్ అల్ అన్బియా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ సంస్తలు, బ్యాంకులకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

తాజాగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఒక కీలక బ్యాంకుపై ఇజ్రాయెల్ అర్ధరాత్రి దాడి చేసింది. ఈ ఘటనలో చాలా మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము కూడా ఇలాగే అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడి చేస్తామని, అక్కడి ప్రజలు ఆ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. 

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సహా గల్ఫ్ కంట్రీస్‌లోని అమెరికాకు చెందిన సంస్థలపై దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ దాడులకు సంబంధించి అమెరికన్ సంస్థల టార్గెట్ లిస్టును ఇరాన్ ప్రకటించింది. ఇందులో ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీలు, ఇన్‌ఫ్రా కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, పాలంటిర్, నివిడియా, ఒరాకిల్ వంటి సంస్థలున్నాయి. 

ఈ సంస్థలు గల్ఫ్ దేశాలలో, ఇజ్రాయెల్‌లలో పలు ఆఫీసుల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు చమురు సంస్థలు, ఆర్థిక కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ఇండియా, చైనా వంటి పలు ఆసియా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 300 బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను రిలీజ్ చేసింది. దాంట్లో సగం వ‌ర‌కు క్ల‌స్ట‌ర్ బాంబుల‌తో కూడి వార్‌హెడ్స్ ఉన్న‌ట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొన్న‌ది. మంగ‌ళ‌వారం కూడా ఇరాన్ త‌న క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించింది.  క్ల‌స్ట‌ర్ బాంబుల్లో ఉన్న వార్‌హెడ్స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. క్షిప‌ణి పేలిన త‌ర్వాత వాటి నుంచి పేలుడు ప‌దార్ధాలు డ‌జ‌న్ల సంఖ్య‌లో వేరుప‌డుతాయి. =

క్ల‌స్ట‌ర్ బాంబుల‌ను వ‌దిలే క్షిప‌ణుల‌ను ప్ర‌స్తుతానికి స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నామ‌ని, కానీ వాటి వాళ్లు స‌వాళ్లు ఉన్న‌ట్లు ఇజ్రాయెల్ మిలిట‌రీ పేర్కొన్న‌ది. ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రం సంపూర్ణంగా సుర‌క్షితంగా లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  మరోవంక, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతీకార దాడులు చేస్తోంది. తాజాగా ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దౌత్య కార్యాలయ లాజిస్టిక్‌ హబ్‌పై ఇరాన్‌ అనుమానిత డ్రోన్‌ దాడిచేసినట్లు గుర్తించారు.
 
చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ మోహరించిన మైన్‌లేయర్స్‌, నౌకలు లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడడంతో అవి ధ్వంసమయ్యాయి. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్‌తో పాటు పలు నౌకలు ధ్వంసం అయ్యాయని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్ వెల్లడించింది. ఈ క్రమంలనే దాడికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. 
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సైతం ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. జలసంధి సమీపంలో ఇరాన్‌ ఎక్కడైనా మైన్స్‌ను అమర్చినట్లయితే వాటిని తక్షణమే తొలగించాలని ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్ చేశారు. లేదంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.