అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా అనేక భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోవడంతో భారతదేశ కార్గో భద్రత, సిబ్బంది రక్షణ, ఇంధన సరఫరాలపై ఆందోళనలను రేపింది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత జెండా ఉన్న దాదాపు 37 నౌకలు హార్ముజ్ ప్రాంతంలో చిక్కుకుని, రూ. 10 వేల కోట్లకు పైగా విలువైన షిప్పింగ్ ఆస్తులు పెరుగుతున్న భద్రతా ప్రమాదాలకు గురవుతున్నాయి.
ఈ నౌకల్లో ఎక్కువగా ముడి చమురు, ఎల్పీజీని రవాణా చేసే షిప్పులు ఉన్నాయి. భారత జాతీయ నౌకా యజమానుల సంఘం (ఇన్సా) ఈ పరిస్థితిపై ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. నివేదిక ప్రకారం కీలకమైన నౌకా మార్గాన్ని బ్లాక్డ్ స్టైల్ క్లోజర్ గా వర్ణించడంతో ఓడలు చిక్కుకుపోయాయి.
చైనా, ఇరానియన్ నౌకలు ఇంకా ఈ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్నాయని, భారత ఆపరేటర్లు సురక్షితంగా ప్రయాణించగలిగే స్థితి ఉందో లేదో స్పష్టత ఇవ్వాలని ఇన్సా ప్రభుత్వాన్ని కోరింది.భారత్ ఎల్పీజీ దిగుమతులు 85 శాతం హార్ముజ్ జలసంధి గుండా వస్తుందనే పరిస్థితి. దీర్ఘకాలిక అంతరాయం జరిగినపుడు భారత ఇంధన సరఫరాకు సవాళ్లు రేకెత్తే అవకాశం ఉందని అసోసియేషన్ హెచ్చరించింది.
ఫిబ్రవరి 28 నుండి ఇప్పటికీ మూడు భారతీయ ట్యాంకర్లు దాడికి గురైన సంగతి తెలిసిందే. ఒకటి క్షిపణి దాడి నుండి తప్పించుకోగలిగిన ఘట్టం కూడా ఈ నివేదికలో వెల్లడైంది. లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ ప్రకారం అంతర్జాతీయంగా వ్యాపారం చేసే దాదాపు 200 ముడి, ఉత్పత్తుల ట్యాంకర్లు గల్ఫ్ జలాల్లో చిక్కుకుపోయాయి.
ప్రస్తుతం భారత జెండా కలిగిన చమురు ట్యాంకర్లు, ఎల్పీజీ క్యారియర్లలో సుమారు 400 మంది భారతీయ నావికులు ఉన్నారని ఇన్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ దేవ్లీ తెలిపారు. భారత్ తన చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశీ దిగుతులపైనే ఆధారపడుతుంది. మనకు అవసరమైన ఎల్పీజీలో 62 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. భారత్ ప్రతి ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుంది. ఇందులో గృహావసరాల కోసమే 87 శాతం వాడితే, మిగతా 13 శాతమే వాణిజ్య పరంగా వాడుతున్నారు.

More Stories
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బెర్స్ రాజీనామా
ఎల్పీజీ గ్యాస్ కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్ల మూసివేత
ట్రంప్ త్వరలో యుద్ధం ముగింపు అనడంతో తగ్గిన చమురు ధరలు