భారత్ నిఘా అధికారులతో బంగ్లాదేశ్ సైనిక నిఘా చీఫ్ భేటీ!

భారత్ నిఘా అధికారులతో బంగ్లాదేశ్ సైనిక నిఘా చీఫ్ భేటీ!
మార్చి ప్రారంభంలో ఢాకా తన సైనిక నిఘా సంస్థ చీఫ్‌ను భారతదేశానికి పంపింది.  బీఎన్‌పీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి జరిగిన మొదటి ఉన్నత స్థాయి పర్యటన ఇదేనని అధికార వర్గాలు తెలిపాయి.
 
బంగ్లాదేశ్‌లోని అత్యున్నత రక్షణ నిఘా సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ (డిజిఎఫ్ఐ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ కైజర్ రషీద్ చౌదరి మార్చి 1 నుండి 3 మధ్య ఢిల్లీని సందర్శించారు. ఆయన భారత విదేశీ నిఘా సంస్థ ఆర్ఏడబ్ల్యు చీఫ్ పరాగ్ జైన్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్ ఎస్ రామన్‌లను కలిశారు.
 
ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత, ఫిబ్రవరి 22న, రెహమాన్ బ్రిగేడియర్ జనరల్ కైజర్ రషీద్‌ను మేజర్ జనరల్‌గా పదోన్నతి కల్పించి, డిజిఎఫ్ఐ డిజిగా నియమించారు. మార్చి 2న ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఒక ప్రైవేట్ విందులో సమావేశమయ్యారు. అక్కడ నిఘా భాగస్వామ్యం, భద్రతా భాగస్వామ్యంపై వివరణాత్మక చర్చలు జరిగాయని అదిఆకార వర్గాలు తెలిపాయి.
 
బంగ్లాదేశ్‌లో భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భారతదేశానికి బలమైన భద్రతా ఆందోళనలు ఉన్నాయి. అటువంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ఢిల్లీ ఢాకాలోని కొత్త ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడానికి ఆసక్తిగా ఉంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని ఒక అంచనా ఉంది.  కాబట్టి, రాబోయే వారాలు, నెలల్లో భద్రతా రంగంలో సహకారం ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. 
మరోవంక, మార్చి 8న, ప్రముఖ బంగ్లాదేశ్ రాజకీయ కార్యకర్త షరీఫ్ ఉస్మాన్ బిన్ హాది హత్య కేసులో నిందితులైన ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయులను పశ్చిమ బెంగాల్‌లోని బోంగావ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) ఆదివారం తెలిపింది. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని బోంగావ్ నుండి నిందితులు రాహుల్ (37), అలియాస్ ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ హొస్సేన్ (34)లను అరెస్టు చేశారు.
“ఉస్మాన్ హాది హత్య కేసులో ఇద్దరు నిందితులను కోల్‌కతాలో అరెస్టు చేసినట్లు నిన్న మాకు తెలిసింది. వారిని రెండు వారాల పాటు పోలీసు రిమాండ్‌కు తరలించినందున, వారి గుర్తింపులను నిర్ధారించడానికి కోల్‌కతాలోని మా మిషన్ ద్వారా కాన్సులర్ యాక్సెస్‌ను కోరాము. ఎందుకంటే వారి గురించి మాకు తగిన సమాచారం లేదు,” అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి షామా ఒబాద్ ఇస్లాం సోమవారం ఢాకాలో విలేకరులకు తెలిపారు.