నకిలీ సమాచారం, భావ వ్యక్తీకరణపై సమతుల్యత అవసరం

నకిలీ సమాచారం, భావ వ్యక్తీకరణపై సమతుల్యత అవసరం

నకిలీ ఆన్‌లైన్‌ సమాచారం నుండి దేశాన్ని రక్షించుకోవడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడానికి మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము తీసుకువచ్చిన సమాచార సాంకేతికత (ఐటి) నిబంధనలను కేంద్రం సమర్ధించుకుంది.  సమాచార సాంకేతిక చట్టం లేదా నిబంధనల కింద హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, భావ ప్రకటనను, విమర్శనాత్మమైన భావ వ్యక్తీకరణను అణచివేయాలనే ఉద్దేశం లేదని కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. 

2023 ఏప్రిల్‌లో సవరించిన మేరకు ఐటి (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక నిబంధనావళి) నిబంధనలు ద్వారా 2024 మార్చిలో జారీ చేసిన నోటిఫికేషన్‌తో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి) కింద ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌ (ఎఫ్‌సియు)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల గురించి బూటకపు వార్తలు లేదా తప్పుడు సమాచారం సృష్టించడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఒక ‘అడ్డుకట్ట’గా ఈ ఎఫ్‌సియు పనిచేయాల్సి వుంది. 

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా దాఖలు చేసిన పిటిషన్లతో బాంబే హైకోర్టు ఈ సవరించిన నిబంధనలు, ఎఫ్‌సియు ఏర్పాటులపై న్యాయ పరిశీలన చేపట్టింది. ఆ మేరకు ఎఫ్‌సియు నోటిఫికేషన్‌ను హైకోర్టు 2024 సెప్టెంబరులో కొట్టివేసింది. 2023లో సవరించిన ఐటి నిబంధనలు కూడా రాజ్యాంగ విరుద్ధమని నిర్ధారించింది.

రాజ్యాంగంలోని 14వ అధికరణ (సమానత్వ చట్టం), 19వ అధికరణ (భావ ప్రకటనా స్వేచ్ఛ), 19 (1)(జి) (స్వేచ్ఛ, వృత్తి హక్కు)లను ఈ నిబంధనలు ఉల్లంఘి స్తున్నాయని పేర్కొంది. నిబంధనల్లో భావ ప్రకటన ‘బూటకం, తప్పు, తప్పుదారి పట్టించేది” అని పేర్కొనడం చాలా అస్పష్టంగా వుందని, వాటికి ఎలాంటి నిర్వచనం లేనందున అవన్నీ తప్పని నిర్ధారించింది. 

‘సత్యానికి ఏకైక న్యాయనిర్ణేత’గా ప్రభుత్వం ఆ పాత్రను పోషించలేదని హైకోర్టు పేర్కొంది. బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయాలనే క్రూరమైన ఆలోచనేదీ తమకు లేదని పేర్కొంది. ప్రత్యేకంగా ఈ సమాచారం బూటకం లేదా నకిలీదని ఎఫ్‌సియులో ఎవరు నిర్ణయిస్తారని ఎడిటర్స్‌ గిల్డ్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా మ్యాగజైన్స్‌, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ అసోసియేషన్‌ల తరపు న్యాయవాదులు అరవింద్‌ దత్తార్‌, ఎన్‌.హెచ్‌.సీర్వారు ప్రశ్నించారు.

 ”అసలు ఎఫ్‌సియును నిర్వహించేది ఎవరు? కేవలం ఒక నోటిఫికేషన్‌ ద్వారా అటువంటి యూనిట్‌ను ఎలా ఏర్పాటు చేస్తారు?” అని వారు ప్రశ్నించారు. సక్రమంగా నిబంధనలను రూపొందిం చాలని మాత్రమే హైకోర్టు ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. 

దానిపై చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ, ‘ఈ కేసులో లేవనెత్తిన అంశం చాలా ప్రాధాన్యతను కలిగివుంది. ఇందుకు చట్టాన్ని రూపొందించడం మంచిది. హైకోర్టు లేవదీసిన అంశాలతో, వ్యక్తిగత రాజ్యాంగబద్ధమైన హక్కులను దెబ్బతీయకుండా హక్కులను సమతుల్యం చేయడమెలాగ అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆన్‌లైన్‌ వేదికల్లో కొన్ని చాలా దారుణంగా దాడులు చేస్తున్నాయని’ చీఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్యా నించారు. 

”వ్యక్తిగత జీవితాన్ని లేదా దేశాన్ని దేన్నైనా మీరు దెబ్బతీయగలుగుతారు.” అని ఆ వేదికలను ఉద్దేశించి పేర్కొన్నారు. అలా తప్పుదారి పట్టించే లేదా బూటకమైన వాటిని తొలగించాలని దత్తార్‌ తెలిపారు. ఆ ‘తప్పుదారి పట్టించే’ అన్నదాన్ని ఎవరు నిర్వచించాలని ఆయన న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వుండాలని చీఫ్‌ జస్టిస్‌ స్పందించారు.

”అయితే, అదే సమయంలో ఈ తప్పుడు సమాచారాన్ని సృష్టించే వారిపై ఎలాంటి బాధ్యతలు పెట్టకుండా మొత్తం భారమంతా ప్రభుత్వ యంత్రాంగంపై మోపడమనేది బాగా పరిశీలించాల్సిన అవసరం వుంది.” అని తెలిపారు. మధ్యలో మెహతా జోక్యం చేసుకుంటూ ‘దాన్ని చూడగానే అది నకిలీదని మనకు తెలిసిపోతుంది.’ అని పేర్కొన్నారు. 

సోషల్‌ మీడియా మధ్యవర్తులకు ఇప్పటికే చాలా తీవ్రమైన బాధ్యతలు వున్నాయని దత్తార్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ, బాంబే హైకోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వాలన్న మెహతా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తాత్కాలిక ఉపశమనాలపై దృష్టి పెట్టకుండా కేసును నేరుగా విచారించడానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు బెంచ్‌ పేర్కొంది.