ఇరాన్ ఆయిల్ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఏం చేస్తున్నావంటూ ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారి తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్లు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్, పరిసర ప్రాంతాల్లోని 30 చమురు డిపోలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
అయితే, ఇరాన్ ఆయిల్ డిపోలపై దాడుల గురించి ఇజ్రాయెల్ ముందుగానే అమెరికాకు తెలియజేసింది. కానీ, ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఇరాన్ చమురు నిల్వలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని అమెరికా సీనియర్ అధికారి ఒకరు ‘యాక్సియోస్’తో పేర్కొన్నారు.
‘ఇది అమెరికా అధ్యక్షుడికి నచ్చలేదు’ అని ట్రంప్ కార్యాలయం ఇజ్రాయెల్‌కు స్పష్టం చేసిందని తెలిపారు. రోజువారీ పౌర వినియోగానికి సంబంధించిన సౌకర్యాలపై దాడులు ఊహించని పరిణామాలను కలిగిస్తాయని అమెరికా ఆందోళన చెందినట్లు ఆ అధికారి తెలిపారు. అలాగే ఇరాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడగట్టే అవకాశంతో పాటు ప్రపంచ చమురు ధరలు పెరిగే పరిణామంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు.
‘ఈ దాడి అధ్యక్షుడికి ఇష్టం లేదు. ఆయన చమురును ఆదా చేయాలనుకుంటున్నారు. దానిని మండించేందుకు ఇష్టపడరు. ఇది అధిక గ్యాస్ ధరలను ప్రజలకు గుర్తు చేస్తుంది’ అని ట్రంప్ సలహాదారుడు అన్నట్లు ‘యాక్సియోస్’ పేర్కొంది. అయితే ఈ మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్, లేదా ఇజ్రాయెల్ సైన్యమైన ఐడీఎఫ్ నిరాకరించాయి.
కాగా, తమ చమురు మౌలిక సదుపాయాలపై నిరంతర దాడులు ఈ ప్రాంతం అంతటా ప్రతీకార చర్యలకు దారితీస్తాయని ఇరాన్ హెచ్చరించింది. ‘టెహ్రాన్ ఇప్పటివరకు విస్తృత స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదు. కానీ పునరాలోచించుకోవచ్చు’ అని ఇరాన్ సైనిక అధికారి మీడియాతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఇంధన నిల్వలపై ఇరాన్ దాడి చేయడం ప్రారంభిస్తే, ప్రపంచ చమురు ధరలు బ్యారెల్‌కు 200 అమెరికా డాలర్ల వరకు (రూ. 18,461) పెరుగవచ్చని ఆయన హెచ్చరించారు.

More Stories
ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు
పశ్చిమాసియా ఘర్షణలపై పీ-5 దేశాల భేటీకి రష్యా పిలుపు
భారత్, చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు కావాలి