ఇరాన్ యుద్ధంపై పుతిన్‌తో గంటసేపు ఫోన్ లో మాట్లాడిన ట్రంప్‌

ఇరాన్ యుద్ధంపై పుతిన్‌తో గంటసేపు ఫోన్ లో మాట్లాడిన ట్రంప్‌
 * ఉక్రెయిన్ నుండి రక్షణ సాంకేతికత కోసం చూస్తున్న అమెరికా
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. వారిద్దరూ దాదాపు గంటసేపు ఫోన్‌లో కీలక అంశాలపై చర్చించారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.  వాషింగ్టన్ చొరవతో జరిగిన ఈ చర్చల్లో యుద్ధాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోటంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్ యుద్ధం, వెనెజువెలా అంశాలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు క్రెమ్లిన్‌ తెలిపింది. ఈ చర్చలు యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు రష్యా తెలిపింది.  “ఇరాన్‌ ప్రభుత్వం ప్రపంచాన్ని ఇబ్బందిపెట్టేందుకు చమురు రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని నేను అస్సలు సహించను. ఒకవేళ వారు అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని ట్రంప్‌ హెచ్చరించారు.
 
యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ భారీగా నష్టపోతున్నట్టు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారని క్రెమ్లిన్ వెల్లడించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్‌నకు పుతిన్ సూచించారని తెలిపింది. యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను ట్రంప్‌నకు పుతిన్ సూచించినట్టు రష్యా విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు,

ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నట్టు యూరి ఉషాకోవ్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గురించి కూడా ట్రంప్‌, పుతిన్ మాట్లాడుకున్నారని పేర్కొన్నారు.  కాగా, ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌తో పుతిన్ మాట్లాడారని, టెహ్రాన్‌కు రష్యా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారని ఉషాకోవ్ వెల్లడించారు.

మరోవంక, ఏడాది క్రితం వరకు రష్యాపై యుద్ధం చేయడానికి అమెరికా సహాయం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వైట్‌హౌస్ చుట్టూ తిరిగారు. ఆ సమయంలో డోనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు జెలెన్‌స్కీని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఒకప్పుడు ఆయుధాల కోసం అమెరికాను అర్థించిన ఉక్రెయిన్, ఇప్పుడు అదే అమెరికాకు రక్షణ సాంకేతికతను అందించే స్థాయికి ఎదిగింది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో  ఇరాన్ తయారు చేసిన అత్యాధునిక డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలకు సవాలు విసురుతున్నాయి. ఈ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చడంలో ఉక్రెయిన్ గత రెండేళ్లుగా విశేషమైన అనుభవాన్ని గడించింది. రష్యాతో యుద్ధంలో ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ సాధించిన ఈ యుద్ధ నైపుణ్యం ఇప్పుడు అమెరికాకు అత్యవసరమైంది. తమ రక్షణ వ్యవస్థలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ సాయం కోసం అగ్రరాజ్యం ఎదురుచూడటం  చర్చనీయాంశంగా మారింది.