తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని చెబుతూ అలాంటి భావజాలం ఉన్నవారితో తెలంగాణ విద్యా విధానం-2026″ పేరిట ఓ నివేదికను తయారు చేయించడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విస్మయం వ్యక్తం చేశారు.
ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో “తెలంగాణ విద్యా విధానం – 2026” అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో విద్యా విధానం లక్ష్యం రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు దారి చూపేలా ఉండాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఏర్పడిందని, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడం, టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం వంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో ఏర్పడిందని తెలిపారు. పాఠశాలల్లో టాయిలెట్స్, మిడ్డే మీల్స్ వంటి కనీస సదుపాయాలు కూడా సరిపడా లేవని తెలిపారు. గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అలాంటి ఘటనల్లో సుమారు 44 మంది విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి తక్కువ లేదా జీరో విద్యార్థులు ఉన్న పరిస్థితి ఉందని తెలిపారు. 2024–25లో రాష్ట్రంలో 5,021 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రస్తుతం అవి 2,023కి తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్ సూచనలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ టి. తిరుపతి రావు విమర్శించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సుమారు 80 శాతం వరకు టీచర్ల ఖాళీలు ఉన్నాయని చెబుతూ వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు. ఒకవైపు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను రిక్రూట్ చేయాలని చెబుతూనే, మరోవైపు స్కూల్స్ లో టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం సరికాదని స్పష్టం చేశారు.
కొత్తగా స్కూల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా, బలహీన వర్గాల ప్రాంతాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడం అవసరం అని చెప్పారు. మాజీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్లు ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఎన్సీఈఆర్టీ మాజీ మెంబర్ సెక్రటరీ పి. మురళి మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
More Stories
ఎల్పీజీ గ్యాస్ కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్ల మూసివేత
ట్రంప్ త్వరలో యుద్ధం ముగింపు అనడంతో తగ్గిన చమురు ధరలు
అమెరికా ప్రోత్సహిస్తున్నా భూతల పోరుకు కుర్దిష్ యోధులు వెనకడుగు!