సీఈసీకి నల్లజెండాలతో నిరసనలు.. ప్రతిపక్షాల అవిశ్వాసం?

సీఈసీకి నల్లజెండాలతో నిరసనలు.. ప్రతిపక్షాల అవిశ్వాసం?
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ కు కోల్‌కతాలో నిరసనల సెగ తగిలింది. మరోవంక,  స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా జ్ఞానేశ్ కుమార్‌ పై ఇండియా బ్లాక్ పార్టీలు అభిశంస‌న తీర్మానాన్ని రాబోయే రోజుల్లో అభిశంస‌న ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని సోమవారం ఉదయం దర్శించేందుకు వచ్చిన ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 
 
‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు సకాలంలో పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఆయన ఆలయాన్ని దర్శించుకున్నారు. బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన అనంతరం తొలిసారి సీఈసీ ఆదివారం రాత్రి కోల్‌కతా వచ్చారు. విమానాశ్రయం వద్ద కూడా ఆయనకు ఇదే తరహా నిరసనలు ఎదురయ్యాయి.

విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా టీఎంసీ కార్యకర్తలను ఆయనను టార్గెట్ చేసుకుని ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్ వెళ్తున్న దారిలో నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. వామపక్ష పార్టీలు ఎయిర్‌పోర్ట్ బయట నిరసనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అయితే పరిస్థితలు చేజారిపోకుండా పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లను సమీక్షించేందుకు మూడ్రోజుల పర్యటనకు సీఈసీ కోల్‌కతా వచ్చారు.
రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. సిఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కూడా ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనున్నారు.  శాంతి భద్రతల పరిస్థితి, చేయాల్సిన ఏర్పాట్లు, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధానంగా సీఈసీ టీమ్ సమీక్షించనుంది. బూత్ స్థాయి అధికారులతోనూ సమావేశం కానుంది. పర్యటన చివర్లో మీడియా సమావేశం ఉంటుంది. 
కాగా, పార్ల‌మెంట్‌లో కాంగ్రెస్ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ విప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే నేతృత్వంలో జ‌రిగిన ఇండియా బ్లాక్ పార్టీల స‌మావేశంలో తృణ‌మూల్ కాంగ్రెస్ నేత శ‌తాబ్ధి రాయ్ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. ప‌శ్చిమ బెంగాల్‌లో స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ సందర్భంగా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ అంశంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి, ఆ రాష్ట్రానికి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తుతున్నాయి.

ఎస్ఐఆర్ గురించి బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం ప‌ట్ల సీఈసీ జ్ఞానేశ్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తృణ‌మూల్ నేత‌లు ఆరోపిస్తున్నారు. త‌మ పార్టీ బృందంపై సీఈసీ జ్ఞానేశ్ అరిచార‌ని, దీన్ని తాము సీరియ‌స్‌గా తీసుకోనున్న‌ట్లు టీఎంసీ నేత చంద్రిమ భ‌ట్టాచార్య తెలిపారు.