ఆయుధాల దిగుమ‌తిలో ఉక్రెయిన్ తర్వాత అగ్రగామి భారత్

ఆయుధాల దిగుమ‌తిలో ఉక్రెయిన్ తర్వాత అగ్రగామి భారత్
`ఆత్మనిర్భర్ భారత్’, `భారత్ లో తయారీ’ విధానాలతో స్వదేశీ ఆయుధాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ప్రపంచంలో యుద్ధంలో చిక్కుకున్న ఉక్రెయిన్ తర్వాత అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ నిలిచింది. 2021 నుండి 2025 వరకు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ తర్వాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులలో ఒకటిగా అవతరించింది. 
 
పాకిస్తాన్ కూడా తన ఆయుధ కొనుగోళ్లను గణనీయంగా పెంచిందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తాజా నివేదిక  ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్‌ఫర్స్, 2025 వెల్లడించింది. 2021 నుంచి 2025 వ‌ర‌కు అయిదేళ్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 8.3 శాతం ఆయుధాలు దిగుమ‌తి చేసుకున్న దేశంగా భార‌త్ నిలిచిన‌ట్లు సిప్రి పేర్కొన్న‌ది. 
 
ఇక అత్య‌ధిక సంఖ్య‌లో ఆయుధాలు దిగుమ‌తి చేసుకున్న దేశాల్లో ఉక్రెయిన్ నిలిచింది. ర‌ష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ గ‌త అయిదేళ్ల‌లో 9.7 శాతం ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకున్న‌ట్లు సిప్రి రిపోర్టులో వెల్ల‌డించారు.  అయితే, గత రికార్డుల‌తో పోలిస్తే భార‌త్‌లో ఆయుధాల దిగుమ‌తి త‌గ్గిన‌ట్లు నివేదిక‌ తెలిపింది. 2016 నుంచి 2020, ఆ త‌ర్వాత 2021 నుంచి 2025తో పోలిస్తే భార‌త్ ఆయుధాలు దిగుమ‌తి చేస్తున్న సంఖ్య 4 శాతం ప‌డిపోయిన‌ట్లు సిప్రి త‌న నివేదిక‌లో చెప్పింది.
ఇటీవ‌ల ఆయుధాల‌ను డిజైన్ చేసి, ఉత్ప‌త్తి చేసే అంశంలో భార‌త్ త‌న సామ‌ర్ధ్యాన్ని పెంచుకున్న‌ద‌ని, దాని వ‌ల్లే దిగుమ‌తి త‌గ్గిన‌ట్లు సిప్రి అభిప్రాయ‌ప‌డింది. ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం భార‌త్ ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఫ్రాన్స్ నుంచి సుమారు 140 యుద్ధ విమానాలు, జ‌ర్మ‌నీ నుంచి జ‌లాంత‌ర్గామిని తెప్పించేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. 
 
భార‌త్‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న అగ్ర‌దేశాల్లో ర‌ష్యా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్ ఉన్నాయి. ర‌ష్యా నుంచి ఆయుధాలు దిగుమ‌తి చేస్తున్న సంఖ్య త‌గ్గిపోయింది. 2011-15 మ‌ధ్య ఆయుధ దిగుమ‌తి 70 శాతంగా ఉండేది. కానీ ఆ త‌ర్వాత 2016 నుంచి 2020 వ‌ర‌కు దిగుమ‌తి 51 శాతానికి ప‌డిపోయింది. ఆ త‌ర్వాత 2021 నుంచి 2025 వ‌ర‌కు 40 శాతానికి త‌గ్గిన‌ట్లు సిప్రి త‌న నివేదిక‌లో చెప్పింది. 
 
ఇక 2021-25 మ‌ధ్య కాలంలో ఫ్రాన్స్ నుంచి 29 శాతం, ఇజ్రాయెల్ నుంచి 15 శాతం ఆయుధాల‌ను దిగుమ‌తి చేశారు. చైనా, పాకిస్తాన్‌లతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్ ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకున్న‌ట్లు రిపోర్టులో చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న దిగుమ‌ల్లో పాకిస్థాన్ అయిదో స్థానంలో ఉన్న‌ట్లు తెలిసింది. ఆ దేశం సుమారుం 4.2 శాతం ఆయుధాల‌ను దిగుమ‌తి చేసింది. 
 
చైనా త‌న 80 శాతం ఆయుధాల‌ను ట‌ర్కీకి స‌ర‌ఫరా చేస్తోంది. ఇక పాకిస్థాన్‌కు రెండో అతిపెద్ద స‌ర‌ఫ‌రాదారుడిగా నెద‌ర్లాండ్స్ కొన‌సాగుతున్న‌ది. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న దేశాల్లో అమెరికా ఉన్న‌ది. గ్లోబ‌ల్‌గా ఆ దేశం నుంచి 42 శాతం ఆయుధాలు స‌ర‌ఫ‌రా అవుతున్న‌ట్లు గుర్తించారు. మొత్తం 99 దేశాలకు అమెరికా ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసింది.

ఈ కాలంలో 162 దేశాలు, నాలుగు ప్రభుత్వేతర సాయుధ గ్రూపులు ప్రధాన ఆయుధాలను పొందినట్లు సిప్రి గుర్తించింది. పైన పేర్కొన్న కాలంలో మొత్తం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 35 శాతం ఇది దేశాలు, అంటే ఉక్రెయిన్, భారతదేశం, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ పొందాయి.