యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పరమగురువుల్లో ఒకరైన శ్రీ యుక్తేశ్వర్ గిరి మహా సమాధి ఆరాధనోత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట చికోటి గార్డెన్స్ లోని యోగదా సత్సంగ ధ్యాన కేంద్రంలో భక్తులు ధ్యానం, భజనలు, పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఇదే నెల ఏడున యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు జరిగాయి.
ఈ సందర్భంగా వైఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న రాంచీలో సాధు భండారా కార్యక్రమం నిర్వహించారు. దైవసాక్షాత్కారం పొందిన గురువును మృత్యువు దరిచేరదు. అటువంటి గురువు తన మరణ సమయంలో సంపూర్ణ చైతన్యంతో ఈ మానవ శరీరం నుంచి నిష్క్రమిస్తారు, దీనినే మహాసమాధి అంటారు. క్రియాయోగంలో అసమానమైన ఇద్దరు మహనీయుల మహాసమాధిని మార్చి నెల గుర్తు చేస్తుంది.
1952 మార్చి 7న పరమహంస యోగానంద, అంతకుముందు 1936 మార్చి 9న ఆయన గురువు, “ కైవల్యదర్శనం” రచయిత శ్రీ యుక్తేశ్వర్ గిరి మహా సమాధి చెందారు. అయితే ఈ ఇద్దరు గురువులు, తమ శిష్యులకు తమ శక్తిని ఇంకా ఇస్తూనే ఉన్నారు. యోగానంద 17 సంవత్సరాల వయస్సులో కాశీలో శ్రీయుక్తేశ్వర్ను తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు ఆయన హృదయంలో తన గురువు ఎవరో తెలుసుకోవడానికి తీవ్రమైన ఆరాట పడేవారు.
కాశీ సందులలో తిరుగుతూ యుక్తేశ్వరే తన గురువుగా తెలుసుకున్నారు. ఆ సమయం నుంచి , యోగానంద తన గురువు బాటలో కఠినమైన క్రమశిక్షణతో సుశిక్షితులైయారు. యోగానందను యుక్తేశ్వర్ పదేళ్లపాటు తీర్చిదిద్దారు. దాని వల్ల రాబోయే సంవత్సరాలలో యోగానందను ప్రపంచవ్యాప్తంగా క్రియా యోగ గురువుగా గుర్తింపు పొందారు. సాటిలేని మహావతార్ బాబాజీ ఆయనకు అప్పగించిన బాధ్యతను దివ్యంగా నెరవేర్చారు యుక్తేశ్వర్ గిరి.
అదే క్రియాయోగంలో, 30 సెకన్ల ఒక శక్తివంతమైన క్రియా శ్వాస సహజ మానవ పరిణామంలో ఒక సంవత్సరానికి సమానం. “ఒక యోగి ఆత్మకథ”లో వివరించిన విధంగా, క్రియాయోగం అనేది ప్రతి శ్వాసతో రక్తాన్ని కర్బన రహితం (డీకార్బనైజ్) చేసే ఒక సాధనం. చివరికి ఇది శరీర క్షీణతను నిరోధిస్తుంది. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినది. ఆ తర్వాత పతంజలికీ, మనందరికీ తెలిసిన ప్రాచీన విజ్ఞానం. ఈ యుగంలో, మహావతార్ బాబాజీ దీనిని లాహిరీ మహాశయులకు ఇచ్చారు.
ఆయన దానిని యోగానంద గురువు యుక్తేశ్వర్ గిరికి అందించారు. అలా పరంపరగా మహోన్నత జీవధార ప్రవహిస్తోంది. పరమహంస యోగానంద మాటలలో, “నా తర్వాత, ఈ బోధనలే గురువుగా మార్గదర్శనం చేస్తాయి. ఈ బోధనల ద్వారా మీరు నాతోనూ, నన్ను పంపిన మహా గురువులతోనూ ఎప్పుడూ కలిసే ఉంటారు.”

More Stories
సత్యసాయి సంజీవని హార్టకేర్ లో ఉచిత శస్త్ర చికిత్సలు
మహిళల వృత్తి నైపుణ్యం కోసం “స్వాభిమాన్ ప్రాజెక్ట్” కేంద్రం
శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత కార్యాలయం ప్రారంభం