రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి లేఖ రాశారు. శనివారం బాగ్డోగ్రా విమానాశ్రయం సమీపంలో జరిగిన గిరిజన సంఘం అంతర్జాతీయ సంతాల్ సదస్సు కార్యక్రమంలో తక్కువమంది హాజరు కావడం పట్ల రాష్ట్రపతి ముర్ము నిరాశ వ్యక్తం చేశారు.
వేదికను బిధాన్ నగర్ నుండి మార్చాలనే నిర్ణయాన్ని ఆమె ప్రశ్నించారు. అయితే, భద్రత, ఇతర లాజిస్టిక్ కారణాలను చూపుతూ, అధికారులు వేదికను బాగ్డోగ్రా విమానాశ్రయానికి సమీపంలోని గోషైపూర్‌కు మార్చారని వివరణ ఇచ్చారు. ఈ మార్పుపై ముర్ము అసహనాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని సందర్శించిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపిస్తూ, ఇది సిగ్గుచేటు, అని, టిఎంసి పాలన ‘నిజంగా అన్ని పరిమితులను దాటిందని’ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన వేళ ప్రొటోకాల్ పాటించలేదంటూ కొన్ని అంశాలకు వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఈ ప్రశ్నలకు సంబంధించి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కేంద్రం కోరింది.
అయితే, రాష్ట్రపతి కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే వాటికి ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
అలాగే కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయలేదని ఆమె ఆరోపించారు. ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో చెత్త సమస్య, గ్రీన్ రూమ్ లోపాలు, మహిళల కోసం సరైన టాయిలెట్లు లేకపోవడం వంటి సమస్యలు ఉంటే వాటికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని ఆమె స్పష్టం చేశారు.
మరోవంక, బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతూ, రాష్ట్రపతిని అవమానించినందుకు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సమాజ గౌరవాన్ని కాపాడాలంటే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం క్షమాపణ చెప్పడం సరిపోదని పేర్కొంటూ ముఖ్యమంత్రి బంగాల్‌ను వ్యక్తిగత రాజ్యంలా పాలిస్తున్నారని, బాద్షాలా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు.
లేఖలో ప్రస్తావించిన అంశాలు
- రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎందుకు హాజరు కాలేదు ?
- రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్ రూమ్‌లో నీళ్లు లేవు.
- రాష్ట్రపతి కాన్వారు వెళ్లే దారి చెత్తతో నిండిపోయింది.
- డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగుడి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ను బాధ్యులుగా పేర్కొంటూ.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయండి

More Stories
దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.31 లక్షల కోట్లు సంపద ఆవిరి
పశ్చిమాసియాలో పరిణామాలు ఆందోళనకరం
ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు