పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న దాడి తదితర పరిణామాలపై పార్లమెంట్‌లోని రెండు సభల్లోనూ జైశంకర్ ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు ముందు చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుబట్టాయి. ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాల మధ్యే ప్రకటన చేస్తున్న జైశంకర్ వివరించారు.
ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు చర్చలు, సంప్రదింపులు నిర్వహించాలని తాము విశ్వసిస్తామని, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. సంక్షోభం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఎప్పటికప్పడు అంచనా వేస్తున్నామని, ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు కోటి మంది భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టినట్టు చెబుతూ ఇప్పటికే 67 వేల మంది భారతీయులు స్వదేశానికి తిరుగుపయనమైనట్టు వెల్లడించారు. మన దేశ ఇంధన భద్రతకు ఆ ప్రాంతం చాలా కీలకమైందని, ఆయిల్, గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీలు ఉన్నాయని చెబుతూ ఇరాన్‌కు అత్యవసరం కానటువంటి పర్యటన చేయవద్దు అని భారతీయులకు సలహా ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
ఇరాన్ నాయకులతో గతంలో సంప్రదించామని, కానీ ఈ దశలో చాలా కష్టంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. అయినా కానీ ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాకచితో మాట్లాడానని, ఆ తర్వాత మార్చి 5వ తేదీన కూడా చర్చించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ ఇరాన్‌తో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరపనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొచ్చిలో ఉన్న ఇరాన్ నౌక గురించి కూడా సభలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
చమురు మార్కెట్‌ను అంచనా వేసి, దాని ప్రకారమే భారతీయులకు ఇంధన భద్రత కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, వాణిజ్య లక్ష్యాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. భారత వినియోగదారులపై భారం పడకుండా, చమురు లభ్యత, ధరలను నియంత్రించేందుకు దౌత్యపరంగా కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేస్తుండగా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా విమర్శించారు. ప్రకటన చేస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించి వాక్‌అవుట్ చేయడం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు దేశ ప్రయోజనాల కంటే అశాంతి సృష్టించడానికే ప్రయత్నిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ చర్చల సమయంలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నప్పుడు కూడా తరచుగా వాక్‌అవుట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయి చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా ప్రతిపక్ష్ ఎంపీలు నిరసనలు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తున్నదని వారు విమర్శించారు.

More Stories
దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.31 లక్షల కోట్లు సంపద ఆవిరి
ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు
మూడోసారి టీ20 ప్రపంచకప్ భారత్ కైవసం