మహిళల వృత్తి నైపుణ్యం కోసం “స్వాభిమాన్ ప్రాజెక్ట్” కేంద్రం

మహిళల వృత్తి నైపుణ్యం కోసం “స్వాభిమాన్ ప్రాజెక్ట్” కేంద్రం

మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎఈ ఫౌండేషన్  “స్వాభిమాన్ ప్రాజెక్ట్” కేంద్రాన్ని ప్రారంభించింది. ఫలక్‌నుమాలోని ఆర్‌ఎన్‌బీ కాలనీలో ఉన్న బంజారా సంక్షేమ సముదాయ భవనంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలకు వృత్తి నైపుణ్యాలు అందించి వారికి స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని జాతీయ ఫాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూటీ (నిఫ్ట్) విద్యార్థులు స్థానిక మహిళలకు ఆధునిక కుట్టు,  దర్జీ పనులపై శిక్షణ అందించనున్నారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన కుట్టు యంత్రాలను వ్యాపారవేత్తలు గోపాల్ చౌధరి, అజయ్ కుమార్ శుక్లా బహుకరించారు. ఈ కేంద్రం మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం స్థిరమైన వేదికగా పనిచేయనుంది।

ప్రారంభ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక నిర్వాహకురాలు సంగీత మిశ్ర,  బండ్లగూడా రెవెన్యూ అధికారులు ప్ర‌వీణ్, మోహన్, ఫలక్‌నుమా  సీఐ జంగయ్య, క్రైమ్ సీఐ జాకిర్ హుస్సేన్, ఎస్‌ఐ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.  నాయక్ నగర్ కాలనీ కమిటీ నాయకులు శంకర్ నాయక్, కృష్ణ నాయక్, శ్రీను నాయక్, దినేష్, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు.

స్థానిక మహిళల భారీ సంఖ్యలో హాజరుకాగా, భవిష్యత్తులో స్వాభిమాన్ ప్రాజెక్టు ద్వారా మరిన్ని కేంద్రాలను ప్రారంభించి మహిళలను మరింతగా సాధికారత దిశగా తీసుకు వెళ్లగలమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.